Thavanampalle: దిగువమాఘంలో రూ.3 కోట్లతో రాజన్న హెల్త్ సెంటర్ కి భూమిపూజ

Thavanampalle: తవణంపల్లి మండలం దిగువమాఘంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హెల్త్ సెంటర్‌కు డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు భూమిపూజ చేశారు.

VASU, PUTTALAPATTU
Published on: 15 Oct 2026 8:19 PM IST
Thavanampalle
X

Thavanampalle: దిగువమాఘంలో రూ.3 కోట్లతో రాజన్న హెల్త్ సెంటర్ కి భూమిపూజ

తవణంపల్లి: దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ.. రూ.3 కోట్లతో గ్రామీణ ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు రాజన్న ఫౌండేషన్ శ్రీకారం.

తవణంపల్లి మండల కేంద్రంలో అమరరాజ గ్రూప్స్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాజన్న ఫౌండేషన్ ద్వారా దిగువమాఘంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమం రాజన్న ఫౌండేషన్ చైర్మన్, మరియు అమర్ రాజా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు డా. గల్లా రామచంద్ర నాయుడు చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా డా. గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ, “ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ వైద్య సేవలకు దూరం కాకూడదన్నదే రాజన్న ఫౌండేషన్ లక్ష్యం. ఈ హెల్త్ సెంటర్ ద్వారా దిగువమాఘం, పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నా మన్నారు. ఇందులో ఉచిత ప్రాథమిక వైద్య సేవలు, ఉచిత క్లినికల్ ల్యాబ్, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ సేవలు అందించడానికి నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళల ఆరోగ్య అవసరాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాం. అంతేకాకుండా, నెలకు రెండుసార్లు అమరా హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. తద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను స్థానికంగానే చేరువ చేయడంతో పాటు, వారి ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయగలుగుతాం” అని తెలిపారు.

ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయి వైద్య సేవలు ప్రారంభమైన తర్వాత దిగువమాఘం, పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఈ కేంద్రం దోహదపడనుంది.

ఈ కార్యక్రమంలో రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, మాజీ సర్పంచులు కుమార్ నాయుడు, పరంధామ నాయుడు, గోపి మరియు సమీప గ్రామస్తులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU