Renigunta: గంగ జాతరకు పటిష్ట భద్రత: వ్యాపారులతో సీఐ జయచంద్ర సమావేశం!
Renigunta: రేణిగుంటలో ఆగస్టు 17 నుండి 19 వరకు జరగనున్న గంగ జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు సీఐ జయచంద్ర వ్యాపారులు, దుకాణదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Renigunta: గంగ జాతరకు పటిష్ట భద్రత: వ్యాపారులతో సీఐ జయచంద్ర సమావేశం!
Renigunta: రేణిగుంట పట్టణంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న గంగ జాతరను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా,ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో వ్యాపారులు, దుకాణదారులతో సమావేశం నిర్వహించారు.
రేణిగుంట సీఐ ఎస్. జయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జాతర సమయంలో పాటించాల్సిన నిబంధనలను వ్యాపారులకు వివరించారు. జాతరకు వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ కోరారు.
రహదారులను ఆక్రమించకుండా, దుకాణాల ముందు వస్తువులను రోడ్డుపై ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని తెలిపారు.
అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ సూచించారు. భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు.
ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించి గంగ జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని సీఐ ఎస్. జయచంద్ర కోరారు.




