Madanapalle: వేరే ఆస్తి ఉంటే బహిరంగంగా సీజ్ చేసుకోండి: కోనేటి అనూష సవాల్
Madanapalle: తమ ఆస్తులు సక్రమమేనని, అక్రమమని నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని మార్పురి వెంకటేష్ నాయుడిపై కోనేటి సులోచన కుమార్తె అనూష సవాల్ విసిరారు.
Madanapalle: వేరే ఆస్తి ఉంటే బహిరంగంగా సీజ్ చేసుకోండి: కోనేటి అనూష సవాల్
మదనపల్లె: తన తల్లి కోనేటి సులోచన పేరుతో ఉన్న ఆస్తి సక్రమంగా వచ్చినదేనని, అది అక్రమార్జన కాదని కోనేటి అనూష తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరు రోడ్డులోని ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోనేటి అనూష మాట్లాడుతూ తాము గత 17 సంవత్సరాలుగా మదనపల్లెలో నివసిస్తున్నామని, మార్పురి వెంకటేష్ నాయుడుతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మార్పురి వెంకటేష్ నాయుడు తన తల్లి కోనేటి సులోచనకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఆస్తిపై కొందరు కన్నేసి, ఆయనను పావుగా ఉపయోగించుకుని తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
తన తల్లి పేరుతో మార్పురి వెంకటేష్ నాయుడు రాసిచ్చిన ఆస్తి తప్ప తమ కుటుంబానికి మరే అక్రమ ఆస్తి లేదని, వేరే ఆస్తి ఉన్నట్లు ఎవరైనా నిరూపిస్తే బహిరంగంగా సీజ్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
తమ ఆస్తి అక్రమమని నిరూపిస్తే స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన తల్లితో మార్పురి వేంకటేష్ నాయుడు ఫోన్‌లో జరిగిన సంభాషణకు సంబంధించిన వాయిస్ రికార్డును పాత్రికేయులకు వినిపించారు. ఆ రికార్డులో తన తల్లి కోనేటి సులోచన తో“నా ఆస్తి నీకు నేను రాసిచ్చాను.. ఎవరికి ఏం బాధ?” అని చెప్పినట్లు అనూష తెలిపారు.
ఈ వాయిస్ రికార్డు తమ ఆస్తికి సంబంధించిన వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా తమపై తప్పుడు కేసులు పెట్టగా న్యాయబద్ధంగా ఎదుర్కొని తమ తప్పు లేదని నిరూపించుకున్నామని తెలిపారు.
తమపై తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు తన తల్లిని అంటగట్టి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని, తమ కుటుంబానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చి చెప్పారు.
తన తల్లి ఎక్కడికీ పారిపోలేదని, అనారోగ్యంతో విజయవాడలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తమ కుటుంబానికి ఏదైనా హాని జరిగితే మార్పురి వెంకటేష్ నాయుడు, కలకడ గోపి తదితరులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోనేటి అనూష కోరారు.




