Madanapalle: మదనపల్లెలో ముదురుతున్న తాగునీటి సంక్షోభం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.

Srinivasulu, Madanapalle
Published on: 15 July 2026 4:51 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ముదురుతున్న తాగునీటి సంక్షోభం!

మదనపల్లె: ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండగా, పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి.

మరోవైపు మున్సిపల్ కుళాయిల ద్వారా కూడా తగినంత నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని అనేక వార్డులు, కాలనీల్లో రెండు నుంచి మూడు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కుళాయిలు పూర్తిగా ఎండిపోవడంతో తాగునీటితో పాటు నిత్యావసర అవసరాలకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు తెల్లవారుజాము నుంచే ఖాళీ బిందెలతో నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ నీటి సరఫరా సరిపోకపోవడంతో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లే ప్రజలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఒక్కో ట్యాంకర్‌కు రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచ్చిస్తూ నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.

వాతావరణ శాఖ వర్షాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తాగునీటి సంక్షోభం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మున్సిపల్ పంచాయతీ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి, అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు కొత్త బోర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మదనపల్లె ప్రజలకు ప్రస్తుతం అతిపెద్ద సమస్య తాగునీరే. వర్షాలు కురిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమే ప్రజలకు ఊరటనిచ్చే మార్గమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story