Srikalahasti: రైల్వే స్టేషన్, మిట్టకండ్రిగ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలి: కాంగ్రెస్!
Srikalahasti: శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సులను రైల్వే స్టేషన్, మిట్టకండ్రిగ వద్ద ఆపాలి. కాంగ్రెస్ నేత తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో డీఎం రేవతికి వినతిపత్రం అందజేత.
Srikalahasti: రైల్వే స్టేషన్, మిట్టకండ్రిగ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలి: కాంగ్రెస్!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళ్లే APSRTC బస్సులను శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్, హౌసింగ్ బోర్డు, మిట్టకండ్రిగ ప్రాంతాల్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారని తెలిపారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషన్ వద్ద రైలు ఎక్కాల్సిన ప్రయాణికులతో పాటు తిరుపతికి వృత్తి, వైద్యం, విద్య తదితర అవసరాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైల్వే స్టేషన్, హౌసింగ్ బోర్డు, మిట్టకండ్రిగ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోందని, దీంతో సమయం వృథా అవడంతో పాటు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో బస్సులు నిలిపేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై డిపో మేనేజర్ రేవతి సానుకూలంగా స్పందిస్తూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగూరయ్య, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.




