Srikalahasti: శ్రీకాళహస్తిలో పోలీసుల ముమ్మర కార్డన్ సెర్చ్!
Srikalahasti: శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్, కొండమిట్టలో పోలీసుల కార్డన్ సెర్చ్. డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు, పత్రాలు లేని 180 వాహనాలు స్వాధీనం.
Srikalahasti: శ్రీకాళహస్తిలో పోలీసుల ముమ్మర కార్డన్ సెర్చ్!
Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, కొండమిట్ట ప్రాంతాల్లో డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.కార్డన్ సెర్చ్‌లో భాగంగా పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన పత్రాలను తనిఖీ చేశారు.
సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం నేరాలకు దారితీసే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మహిళల భద్రతపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలపై ఎలాంటి వేధింపులు, అఘాయిత్యాలు జరిగినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సమస్యలను దాచిపెట్టకుండా పోలీసుల దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1091, 1972, 112, 100, 181 నంబర్లకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించి తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.కార్డన్ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 170 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడించారు.
భవిష్యత్తులోనూ అనుమానాస్పద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు.ఈకార్యక్రమంలో సీఐలు వెంకటేష్, నాగరాజు, ఇబ్రహీం,లక్ష్మి నారాయణ,ఎస్ఐ లు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.




