Sullurupeta: లేడీస్ హాస్టల్‌లో ఉమెన్ సేఫ్టీ డ్రైవ్.. టెక్నాలజీపై అవగాహన
Sullurupeta: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాలతో సూళ్ళూరుపేట కోళ్లమిట్ట లేడీస్ హాస్టల్ లో మహిళా భద్రత అవగాహన సదస్సు జరిగింది.
Sullurupeta: లేడీస్ హాస్టల్‌లో ఉమెన్ సేఫ్టీ డ్రైవ్.. టెక్నాలజీపై అవగాహన
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, సూళ్ళూరుపేట పరిధిలోని కోళ్లమిట్ట లేడీస్ హాస్టల్‌లో వివిధ కంపెనీలకు చెందిన మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మహిళా భద్రతా అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ, మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, సమాజంలోనూ, పని ప్రదేశాల్లోనూ మహిళలకు అత్యంత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే పోలీస్ యంత్రాంగం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేక సూచనలు జారీ చేశారని ఆయన తెలిపారు.
మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయాన్ని ఏ విధంగా పొందాలో వివరిస్తూ, ఎటువంటి వేధింపులకు గురైనా, భద్రతా పరమైన సమస్యలు తలెత్తినా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ధైర్యం చెప్పారు. మహిళలు ఎక్కడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, వారి రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులకు వెళ్లేవారు మరియు ఒంటరిగా ప్రయాణాలు చేసే వారు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,
ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ అత్యవసర సమయాల్లో పోలీసుల సాయం ఎలా పొందాలో వివరించారు. మహిళలకు ఉన్న ప్రత్యేక చట్టాలు, హక్కుల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్, తడ సబ్ ఇన్‌స్పెక్టర్ కొండప్పనాయుడు పాల్గొన్నారు. సుమారు 50 మంది మహిళా ఉద్యోగులు హాజరై, తమకు ఉన్న సందేహాలను అధికారుల వద్ద నివృత్తి చేసుకున్నారు.




