Sullurupeta: హెచ్‌ఎం టీవీ కథనానికి స్పందన.. హాస్టల్‌లో ఎమ్మెల్యే తనిఖీలు!

Sullurupeta: సూళ్ళూరుపేట బీసీ బాలికల వసతి గృహంలో నెలకొన్న దుస్థితిపై హెచ్‌ఎం టీవీ కథనానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తక్షణమే స్పందించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 8 July 2026 10:52 AM IST
Sullurupeta
X

Sullurupeta: హెచ్‌ఎం టీవీ కథనానికి స్పందన.. హాస్టల్‌లో ఎమ్మెల్యే తనిఖీలు!

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని బిసి బాలికల వసతి గృహంలో నెలకొన్న దుస్థితిపై 'హెచ్‌ఎం టీవీ'లో వచ్చిన కథనానికి స్థానిక ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ తక్షణమే స్పందించారు. సమస్య తీవ్రతను గమనించిన ఆమె, నేడు రాత్రి భోజన సమయంలో హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా వసతి గృహంలో 82 మంది విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన రెండు అంతస్తుల భవనంలో నివసిస్తూ, వర్షపు నీరు కారుతున్న ఇబ్బందికర పరిస్థితులను గమనించిన ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నతాధికారులు సమీపంలోనే మరో భవనాన్ని నిర్మించినప్పటికీ, పాత భవనాన్ని ఇంకా ఖాళీ చేయకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు వడ్డిస్తున్న ఆహారం, బాత్‌రూమ్ సౌకర్యాలు మరియు తాగునీటి నాణ్యతను ఆమె స్వయంగా పరీక్షించారు.

​వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎమ్మెల్యే విజయశ్రీ, విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి, "చదువు ఎలా సాగుతోంది? డయాగ్రామ్స్ ఎలా వేస్తున్నారు?" అంటూ వారి విద్యాభ్యాసంపై ఆరా తీశారు. మానవ శరీరంలోని అవయవాలు, వాటి నిర్మాణం, శరీరంలో అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని ఉంటాయనే అంశాలపై శాస్త్రీయంగా ప్రశ్నలు అడిగి, మెడికల్ అంశాలపై విద్యార్థినుల జ్ఞానాన్ని పరీక్షించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "విద్యార్థినుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కూటమి ప్రభుత్వం విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉంది" అని భరోసా ఇచ్చారు. హాస్టల్ నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని,

విద్యార్థులను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. మాట ఇస్తే తప్పని వ్యక్తిగా పేరున్న ఎమ్మెల్యే, తమ హాస్టల్‌కు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకోవడం పట్ల విద్యార్థినులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అపశృతి జరగకముందే ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం పట్ల స్థానికులు ఆమెను అభినందిస్తున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story