Sullurupeta: చర్చి పాస్టర్ ఇంట్లో భారీ చోరీ.. ఇద్దరు దొంగల అరెస్ట్
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం మన్నెముత్తెరి గ్రామంలో చర్చి పాస్టర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.
Sullurupeta: చర్చి పాస్టర్ ఇంట్లో భారీ చోరీ.. ఇద్దరు దొంగల అరెస్ట్
సూళ్ళూరుపేట: విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను సూళ్ళూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ. 7 లక్షల విలువైన నగదు మరియు బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు నాయుడుపేట డీఎస్పీ జీ. చెంచుబాబు తెలిపారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జీ. చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. సూళ్ళూరుపేట మండలం మన్నెముత్తెరి గ్రామంలోని హోలీ గ్రేస్ షాలోమ్ చర్చి వెనుక గల పాస్టర్ ఇంటి తలుపులు పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో, సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ, ఎస్ఐ జి. అజయ్ కుమార్ మరియు వారి సిబ్బంది కోటపోలూరు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారు దొంగతనం చేసినట్లు వెల్లడైంది.
నిందితులు: పాకం మనోజ్ కుమార్ (అలియాస్ మను), 19 ఏళ్లు, తండ్రి: పోలయ్య, కొమ్మినేనిపల్లి గ్రామం, సూళ్ళూరుపేట మండలం; తప్పని ఈశ్వర్, 19 ఏళ్లు, తండ్రి: రమణయ్య, కారుమంచివారి కండ్రిగ, నాయుడుపేట మండలం. రికవరీ చేసిన సొత్తు విలువ రూ. 7 లక్షలు కాగా, అందులో నగదు రూ. 2 లక్షలు మరియు రూ. 5 లక్షల విలువైన 4 సవర్ల బంగారు ఆభరణాలు (రెండు చైన్లు, ఒక జత బుట్టకమ్మలు, ఒక జత చెంప సరాలు, ఒక జత సాదా కమ్మలు, రెండు ఉంగరాలు) ఉన్నాయి.
నేరస్థలంలో నిందితులు వదిలి వెళ్ళిన చెప్పులను ఆధారంగా చేసుకుని, సీఐ ఎం. మురళీకృష్ణ ఈ కేసును ఒక సవాలుగా తీసుకుని ఛేదించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ, ఎస్ఐ జి. అజయ్ కుమార్ మరియు వారి సిబ్బంది (PC-3001 కె. కుప్పారావు, PC-2841 ఎస్. కిషన్, HG-764 వి. కిరణ్ బాబు)లను నాయుడుపేట సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జీ. చెంచుబాబు అభినందించారు. వారిని రివార్డ్ రోల్ కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి:
ఎటువంటి క్లిష్టమైన కేసులనైనా అతి తక్కువ సమయంలోనే ఛేదిస్తూ, నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న సీఐ ఎం. మురళీకృష్ణ పనితీరుపై సూళ్ళూరుపేట పట్టణ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నేర నియంత్రణలో ఆయన చూపుతున్న చొరవ మరియు బాధ్యతాయుతమైన పనితీరు పట్ల స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు.




