Sullurupeta: ప్రతి ఓటును కాపాడే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది

Sullurupeta: సూళ్ళూరుపేటలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 2 Jun 2026 9:13 PM IST
Sullurupeta
X

Sullurupeta: ప్రతి ఓటును కాపాడే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది

Sullurupeta: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ డా. గురుమూర్తి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సదస్సుకు విచ్చేసిన మాజీ మంత్రి కాకాణి, ఎంపీ గురుమూర్తిలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ​ఈ సందర్భంగా మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు తావివ్వకుండా ప్రతి కార్యకర్త తన పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా కాపాడుకోవాలని సూచించారు.

సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లోనూ ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందేలా చూడాలని కోరారు. ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు గ్రామ, వార్డు స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఓట్ల తొలగింపులు, మార్పుల వంటి సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని, వచ్చే నెల రోజుల పాటు కార్యకర్తలంతా సమన్వయంతో అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును కాపాడే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజల హక్కులను కాపాడడంలో వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని, బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీకి వెన్నెముకలా పనిచేసి ఓటర్ల జాబితాను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. SIR ప్రక్రియలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలిసి ఓటు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సదస్సులో వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్షులు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story