Sullurupeta: సూళ్ళూరుపేటలో అంబేద్కర్ భవన కల ఎప్పుడు సాకారమయ్యేను?
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంబేద్కర్ భవన నిర్మాణంపై మాలమహానాడు నేత ఆవల దాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Sullurupeta: సూళ్ళూరుపేటలో అంబేద్కర్ భవన కల ఎప్పుడు సాకారమయ్యేను?
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న అంబేద్కర్ భవన నిర్మాణంపై మాలమహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవల దాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఈ భవనం కోసం రూ. 2 కోట్లు మంజూరయ్యాయి. అయితే, కేటాయించిన స్థలంలోకి మురుగునీరు చేరడం, ఆ స్థలంలోని మట్టి నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. అప్పటి నుండి నేటి వరకు నియోజకవర్గంలో ఎంతో మంది శాసనసభ్యులు మారినా, ఎస్సీ, బలహీన వర్గాల కోసం ఈ భవనాన్ని నిర్మించలేకపోవడం అత్యంత శోచనీయం.
పేద వర్గాల శుభకార్యాలకు, సమావేశాలకు ఎంతో అవసరమైన ఈ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం తాను 2025 జులై 15, 25 తేదీలలో మరియు ఆగస్టు 8న స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్లకు పలుమార్లు విన్నవించానని, వారు కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా, ఒక్క ఇంచు పని కూడా జరగలేదని ఆవల దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ స్థలం చెత్త కుప్పగా మారి, అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధంగా, వారికి అవమానం కలిగించేలా ఉందని ఆయన విమర్శించారు.
ఇప్పటికైనా సంబంధిత శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో మరియు సోషల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి, తక్షణమే కాలువ నిర్మించి, అంబేద్కర్ భవన నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చొరవ చూపాలని కోరుతున్నారు. గతంలో మీడియా సహకారంతో ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యాయని, ఈ సారి కూడా అధికారులు మేల్కొనేలా మీడియా తోడ్పాటు అందించాలని ఆవల దాస్ విజ్ఞప్తి చేశారు. మీడియా వార్తల ద్వారా అధికారులు కదిలితేనే సూళ్ళూరుపేలో అంబేద్కర్ భవన కల సాకారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజల కష్టాలను గుర్తించి, వెంటనే నిర్మాణం చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.




