Chittoor: సేవాభావంతో వైద్య వృత్తి గొప్పతనాన్ని చాటాలి: వీసీ నాగర్కర్
Chittoor: వైద్య విద్యార్థులు మానవతా దృక్పథం, సేవాభావంతో వైద్య వృత్తి గొప్పతనాన్ని చాటాలని చిత్తూరు అపోలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నితిన్ నాగర్కర్ పిలుపునిచ్చారు.
Chittoor: సేవాభావంతో వైద్య వృత్తి గొప్పతనాన్ని చాటాలి: వీసీ నాగర్కర్
చిత్తూరు: వైద్య వృత్తి గొప్పతనాన్ని గుర్తిస్తూ, రోగుల పట్ల మానవతా దృక్పథం, బాధ్యత, సేవాభావంతో భావి వైద్యులు ఎదగాలని ది అపోలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డా. నితిన్ ఎం. నాగర్కర్ సూచించారు. చిత్తూరులోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎఐఎంఎస్‌ఆర్)లో 2026–27 బ్యాచ్ ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికిన అతిథులు.. వైద్య విద్యతో పాటు మానవీయ విలువలు, క్రమశిక్షణ, రోగుల పట్ల బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. వైద్య విద్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి రోగిని ఒక మనిషిగా అర్థం చేసుకుని సేవలందించే విధంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలని డా. నితిన్ నాగర్కర్ అన్నారు.
ఆధునిక వైద్య సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.ఎఐఎంఎస్‌ఆర్ యూనిట్ హెడ్ ఎస్. బాల్‌రాజ్ మాట్లాడుతూ.. డాక్టర్ వృత్తి అత్యంత గౌరవప్రదమైనదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అపోలో సంస్థ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎఐఎంఎస్‌ఆర్ డీన్ డా. రమ్యారామకృష్ణన్ మాట్లాడుతూ.. అపోలో వైద్య విద్యార్థులకు అత్యుత్తమ విద్యా, శిక్షణ వేదికను అందిస్తోందన్నారు. తరగతి గది బోధనతో పాటు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యక్ష రోగుల పరిశీలన, ప్రాక్టికల్ శిక్షణ ద్వారా క్లినికల్ అనుభవాన్ని పొందే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అనీల్ కుమార్ ఎస్., ప్రొఫెసర్ డా. రమ్య, ప్రొఫెసర్ డా. అనిల్ కిశోర్, డా. తెరెసా రాణి, డా. అశోక్ కుమార్ రెడ్డి, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. రంగనాథ్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.




