Rayachoti: కూటమి రెండేళ్ల పాలన అంతా మోసమే.. శ్రీకాంత్ రెడ్డి

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 21 Jun 2026 4:34 PM IST
Rayachoti
X

Rayachoti: కూటమి రెండేళ్ల పాలన అంతా మోసమే.. శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి: ఎన్నికల సమయంలో ఆకాశాన్నంటిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల నుంచి విద్యార్థుల వరకు, మహిళల నుంచి పేదల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసిన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సంబరాలు చేసుకోవడం విడ్డూరమని ఆయన విమర్శించారు.

అన్నదాత సుఖీభవ’ పేరుతో రైతులకు భారీ దగా

రైతులకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో గొప్పగా ప్రచారం చేసి ఓట్లు దండుకున్న కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రైతులను పూర్తిగా మోసం చేశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా రైతుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు.

గత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ద్వారా 53.60 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరగా, ప్రస్తుతం ఆ సంఖ్య 44 లక్షలకు పడిపోయిందన్నారు. సుమారు 7 లక్షల మంది రైతులతో పాటు 3 లక్షల మంది కౌలు రైతులను పథకాల పరిధి నుంచి తప్పించి వారి నోటికొచ్చిన ముద్దను లాక్కున్నారని ఆరోపించారు.

పీఎం కిసాన్ క్రింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది39 లక్షల మంది రైతులకేనని,గత ప్రభుత్వంలో53.60 లక్షల మందికి అందేదని, దీన్నిబట్టి సుమారుగా 14 లక్షల మంది రైతులకు అందడం లేదన్నారు.మొదటి ఏడాది ఎగురకొట్టి కేంద్ర ప్రభుత్వ వాటాను తీసేస్తే రెండవ ఏడాదిలో రూ 14 వేలును అందించారన్నారు.

ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కాకుండా రూ లక్ష రూపాయలను అందిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు చెప్పారని, మొదటి ఏడాది పూర్తిగా ఎగురగొట్టడం,లక్షలాది మంది కౌలు రైతులను కుదించడం న్యాయమా అని ప్రశించారు.

మామిడి రైతుల కన్నీళ్లను పట్టించుకోని ప్రభుత్వం

తోతాపురి మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. కిలోకు రూ.4 ప్రోత్సాహకంగా తూతూమంత్రంగా ప్రకటించిందన్నారు.

కనీసం రూ.20 చొప్పున అందిస్తేనే రైతులకు కొంత ఉపశమనం లభిస్తుందని సూచించారు.రూ 20 అందిస్తే 7 లక్షల టన్నులకు కూడా పెద్ద మొత్తం కాదని, గత ఏడాది,ఈ ఏడాది యోగా మ్యాట్లకు సుమారు రూ 600 కోట్లను ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, ఆ డబ్బులు రైతులకు ఇస్తే ఎంతో ఉపయోగపడి,సంతోషిస్తారన్నారు.

బడులు తెరుచుకున్నా.. పిల్లలకు కిట్లు కనిపించవు!

గత ప్రభుత్వంలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థుల చేతుల్లో ఉండేవని, ఇప్పుడు నెలలు గడుస్తున్నా కిట్లు అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు.పేదలు ,బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలు బ్యాగు తగిలించుకుని,షూ వేసుకుని,టై కట్టుకుని పాఠశాలలకు వెళ్ళాలన్న ఆశ ఉంటుందన్నారు. యుద్ధం కారణంగా ఆలస్యమవుతోందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు.

గత జగన్ ప్రభుత్వంలో బడులు తెరిచిన మొదటి రోజునే కిట్లు అందించారని, ఆయన గుర్తుచేశారు. అమ్మఒడి అయితే బడులు తెరచిన మొదటి వారంలోనే అందించారన్నారు.ఇప్పుడేమో జూలై లో అందిస్తామని చెప్పుచున్నారన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం సమయానికి కిట్లు పంపిణీ చేసిందని గుర్తుచేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఫీజులు చెల్లించాలని కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తుండగా, డిగ్రీలు పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేని దుస్థితి నెలకొందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో సైతం విద్యార్థుల చేత బలవంతపు అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిపారు.

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం

పేదలకు ప్రాణాధారంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రులు రోగులను తిరస్కరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

మహిళలకు రూ.1,500 హామీ ఏమైంది..?

ప్రతి మహిళకు నెలకు రూ.1,500 అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల ఆర్థిక సాధికారత పేరుతో ఓట్లు అడిగి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా మరచిపోయారని విమర్శించారు.

నాడు-నేడు పనులు నిలిపివేత.. విద్యా వ్యవస్థకు దెబ్బ

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో మిగిలిపోయిన కేవలం పది శాతం పనులను కూడా పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి వారి భవిష్యత్తుతో ఆటలాడుతోందని మండిపడ్డారు.యుద్ధం పూర్తయినా పెట్రోలు, డీజిల్, ఇంధన ధరలను తగ్గించడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయన్నారు.

సంబరాలకు కాదు.. సమాధానం చెప్పాల్సిన సమయం!

ప్రజలు రైతు సమస్యలు, నిరుద్యోగం, ధరల భారం, సంక్షేమ పథకాల నిలిపివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన సంబరాలు నిర్వహించడం ప్రజలను అవమానించడమేనని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

హామీలతో మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు

ప్రజలను మభ్యపెట్టే ప్రసంగాలు, ప్రచార ఆర్భాటాలు , వ్యక్తిగత టార్గెట్లు ఎంత చేసినా వాస్తవాలను దాచలేరని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలే తీర్పు చెబుతారని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన పాలకులను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story