Justice for Pragya : చిన్నారిని చంపి పిండి డబ్బాలో పెట్టాడు.. పోలీస్ ఎన్కౌంటర్లో ఖతం అయ్యాడు
Justice for Pragya : ఆగ్రాలో ఏడేళ్ల చిన్నారి ప్రజ్ఞాను కిరాతకంగా చంపిన నిందితుడు సునీల్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. ఎదురుకాల్పుల్లో నిందితుడు ఖతమయ్యాడు.
Justice for Pragya
Justice for Pragya : ఆగ్రా నగరంలో సంచలనం సృష్టించిన ఏడేళ్ల చిన్నారి ప్రజ్ఞా హత్య కేసులో చివరకు పోలీస్ ఎన్‌కౌంటర్‌తో ముగింపు లభించింది. చిన్నారిని కిరాతకంగా చంపి, మృతదేహాన్ని పిండి డబ్బాలో దాచిన నిందితుడు సునీల్‌ను శనివారం (మార్చి 28) తెల్లవారుజామున పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటనతో ఆగ్రాలో నెలకొన్న ఉద్రిక్తతలు కొంతవరకు శాంతించాయి. ఈ విషాదకరమైన ఉదంతం మార్చి 24న ఆగ్రాలోని తాజ్‌గంజ్ ప్రాంతంలో మొదలైంది. గోబర్ చౌకీ నివాసి దినేష్ కుమార్ కుమార్తె ప్రజ్ఞా (7) ఇంటి బయట ఆడుకుంటూ అకస్మాత్తుగా అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట నిర్లక్ష్యం చేశారని స్థానికులు ఆరోపించారు. అయితే, మార్చి 25న తనిఖీలు చేపట్టగా.. ప్రజ్ఞా ఇంటి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్న సునీల్ గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆ దుర్మార్గుడు చిన్నారిని చంపి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పిండి నిల్వ చేసే డబ్బాలో దాచిపెట్టాడు. ఈ వార్త తెలియగానే ఆగ్రా భగ్గుమంది. ఫతేహాబాద్ రోడ్డులో జనం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.
ఎన్కౌంటర్ జరిగిన తీరు
ప్రజ్ఞా హత్య తర్వాత నిందితుడు సునీల్ పరారయ్యాడు. అతనిపై రూ.25,000 రివార్డు ప్రకటించిన పోలీసులు, 12 ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు. మార్చి 27-28 అర్ధరాత్రి సమయంలో బమ్రౌలీ కటారా ప్రాంతంలో సునీల్ తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అతడిని చుట్టుముట్టగా.. నంబర్ ప్లేట్ లేని స్ప్లెండర్ బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒక ఎస్సై గాయపడ్డారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో సునీల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు.
ఆగ్రా ప్రజల ఆగ్రహం.. పోలీసుల సమాధానం
చిన్నారి హత్యతో ఆగ్రా నగరం మొత్తం ఆగ్రహావేశాలతో ఊగిపోయింది. నిందితుడిని తమకు అప్పగించాలని, లేదా కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే చిన్నారి ప్రాణాలు దక్కేవని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఘటన జరిగిన 48 గంటల్లోనే ప్రధాన నిందితుడిని పట్టుకోవడమే కాకుండా, ఎదురుకాల్పుల్లో అతడిని అంతం చేయడం ద్వారా పోలీసులు తమ విధిని నిర్వర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి 315 బోరు తుపాకీ, బుల్లెట్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.




