Kadiri: కళ్లలో కారం చల్లి టీడీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి!

Kadiri: కదిరి వలీ సబ్ రోడ్డులో ఉద్రిక్తత. మాజీ కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా, బషీర్‌లపై షామీర్ వర్గం దాడి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే కందికుంట.

P.RAHAMTULLA, KADIRI
Published on: 11 July 2026 4:35 PM IST
Kadiri
X

Kadiri: కళ్లలో కారం చల్లి టీడీపీ నేతలపై విచక్షణారహితంగా దాడి!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటుచేసుకున్న దాడి ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా, ఆయన సోదరుడు టీడీపీ కార్యకర్త బషీర్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన షామీర్ అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కళ్లలో కారం చల్లి రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనతో వలీ సబ్ రోడ్డులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారం ప్రకారం, ఈ ఘర్షణ వెనుక రాజకీయ కారణాల కంటే గతం నుంచి కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. ఇటీవల షామీర్ మరో రాజకీయ పార్టీ నుంచి టీడీపీలో చేరినప్పటికీ, ఆల్ఫా ముస్తఫా వర్గంతో పాత కక్షలు కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఆల్ఫా ముస్తఫా, బషీర్‌లను తన వాహనంలో కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం బాధితులను పరామర్శించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడికి పాల్పడిన షమీర్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story