Murder : కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై యువ వ్యాపారిని హత్య..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పట్టపగలు జరిగిన ఒక సంచలన హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో సినిమా..
murder
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పట్టపగలు జరిగిన ఒక సంచలన హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో సినిమా స్టైల్‌లో ప్లాన్ చేసి మరీ ఒక యువ వ్యాపారిని అతికిరాతకంగా హతమార్చారు. పాత కక్షలు, వ్యాపార విభేదాల నేపథ్యంలో జరిగిన ఈ భయానక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జిమ్ నుంచి వస్తుండగా పక్కా ప్లాన్‌తో అటాక్
మహారాష్ట్రలోని సిడ్కో ఎన్-7 ప్రాంతానికి చెందిన దేవేష్ అలియాస్ బంటీ దీక్షిత్ (37) అనే యువ వ్యాపారి మేస్ నిర్వహించడంతో పాటు ప్లాట్ల వ్యాపారం చేస్తుండేవాడు. అంతేకాకుండా ఆయన స్థానిక సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. రోజూ లాగే జిమ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పవన్ పరాశర్ (22) అనే నిందితుడు తన కారుతో బంటీ దీక్షిత్ వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి అత్యంత వేగంగా బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బంటీ దీక్షిత్ రోడ్డుపై ఎగిరి కిందపడిపోయాడు.
హాకీ స్టిక్, ఇనుప రాడ్‌లతో దారుణంగా కొట్టి చంపి..
కారు నుంచి కిందకు దిగిన నిందితుడు పవన్ పరాశర్, కిందపడిపోయి ఉన్న బంటీ దీక్షిత్‌పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న హాకీ స్టిక్ , ఇనుప రాడ్‌తో తలపై, ముఖంపై పదే పదే తీవ్రంగా కొట్టడంతో దీక్షిత్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. నడిరోడ్డుపై ప్రజలు చూస్తుండగానే జరిగిన ఈ పట్టపగలు హత్యతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
ఈ ఘోరానికి పాల్పడిన అనంతరం నిందితుడు పవన్ పరాశర్ అక్కడి నుంచి నేరుగా సిడ్కో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన కారుతో పాటు ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాత కక్షలు, వ్యాపార వైరం కోణంలో దర్యాప్తు
ప్రాథమిక విచారణ ప్రకారం.. మృతుడు బంటీ దీక్షిత్‌కు, నిందితుడు పవన్ పరాశర్‌కు మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన వివాదాలు, పాత కక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య వ్యాపార పరమైన పోటీ అలాగే ఇతర వ్యక్తిగత ఘర్షణలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సరిగ్గా ఏ కేసు విషయమైతే కోర్టులో కీలక విచారణ జరగాల్సి ఉందో, అదే రోజు ఈ హత్య జరగడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.




