Drishyam Style Murder : 'దృశ్యం' స్టైల్ మర్డర్.. కాంక్రీట్ కింద భర్త శవం.!
Drishyam Style Murder : సినిమా కథలను తలపించే ఘోరమైన దారుణం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వెలుగు చూసింది. సరిగ్గా 'దృశ్యం' సినిమా తరహాలోనే భర్తను..
Drishyam Style Murder
Drishyam Style Murder : సినిమా కథలను తలపించే ఘోరమైన దారుణం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వెలుగు చూసింది. సరిగ్గా 'దృశ్యం' సినిమా తరహాలోనే భర్తను దారుణంగా హత్య చేసి, 12 అడుగుల లోతులో పాతిపెట్టి, ఆ పైన మందపాటి కాంక్రీట్ నేల నిర్మించిన భార్య, ఆమె ప్రియుడి గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. రెండేళ్లుగా సాగిన ఈ మైండ్ గేమ్‌ను బాధితుడి బంధువుల అనుమానం పటాపంచలు చేసింది.
ఆస్ట్రేలియా డ్రామా.. రెండేళ్ల పాటు నమ్మించిన భార్య
బాధితుడు జిగ్నేష్ మావడియా ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో అతడి భార్య పృథ్వి అలియాస్ భూమిబెన్ ఒక కొత్త కథ అల్లింది. తన భర్త ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, అక్కడ అతడు పనిచేసే కంపెనీ నిబంధనల ప్రకారం ఫోన్ మాట్లాడటం కుదరదని బంధువులను, కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమైన ఒక బావమరిది జిగ్నేష్ అడ్రస్, ఫోన్ నంబర్ అడగడంతో కథ అడ్డం తిరిగింది. సమాధానం చెప్పడానికి ఆమె నీళ్లు నమలడం, దాటవేసే ధోరణి ప్రదర్శించడంతో కుటుంబ సభ్యులకు తీవ్ర అనుమానం వచ్చింది. దీంతో జూలై 26న జిగ్నేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విచారణ ప్రారంభమైంది.
మందు పార్టీ పేరుతో పిలిచి.. సైనేడ్ ఇచ్చి..
పోలీసు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2024 మే 31 రాత్రి, పృథ్వి తన మాజీ ప్రియుడు నిలేష్ కఛటియాతో కలిసి భర్త జిగ్నేష్‌ను వదిలించుకోవడానికి పక్కా ప్లాన్ వేసింది. మద్యం విందు ఉందంటూ జిగ్నేష్‌ను ఒక ఫ్యాక్టరీ వద్దకు పిలిపించారు. అక్కడ అతడికి సైనేడ్ కలిపిన మద్యాన్ని తాగించి దారుణంగా హత్య చేశారు.
హత్య అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు నిలేష్, అతడి స్నేహితుడు బల్వీర్ వర్మ సాయంతో ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాదాపు 12 అడుగుల లోతైన గోతి తవ్వి జిగ్నేష్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని మట్టితో కప్పి, ఎవరికీ అనుమానం రాకుండా సుమారు ఒక అడుగు మందం ఉన్న గట్టి కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి సీల్ చేశారు.
డ్రిల్లింగ్ మెషిన్లతో తవ్వకాలు.. ఎట్టకేలకు శవపరీక్షలకు అస్థిపంజరం
నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జూలై 30న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలు చేపట్టారు. అడుగు మందం ఉన్న కాంక్రీట్ నేలను పగలగొట్టడానికి పవర్ డ్రిల్లింగ్ టూల్స్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. తవ్వకాల అనంతరం లోపల నుంచి అస్థిపంజర అవశేషాలను వెలికితీశారు.
సేకరించిన అవశేషాలు జిగ్నేష్‌వేనా అని నిర్ధారించుకోవడానికి వాటిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) ప్రతిభ తెలిపారు. ప్రస్తుతం భార్య పృథ్వి, ఆమె ప్రియుడు నిలేష్, వారికి సహకరించిన బల్వీర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై హత్య, ఆధారాల విధ్వంసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.




