Blood Mafia : కొత్త రకం క్రైమ్.. బ్లడ్ బ్యాంకుల అండతో పిల్లల రక్తం దోచుకుంటున్న ముఠా

Blood Mafia : యూపీలోని దేవరియాలో డ్రాకులా గ్యాంగ్ పిల్లలను బెదిరించి బలవంతంగా రక్తాన్ని తీసి అమ్ముకుంటోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

CR Reddy
Published on: 15 March 2026 10:27 AM IST
Blood Mafia
X

Blood Mafia 

Blood Mafia : ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమాయక మైనర్ పిల్లలను టార్గెట్ చేస్తూ, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. సినిమాల్లో కనిపించే విధంగా పిల్లలను బెదిరించి, వారి శరీరం నుంచి రక్తాన్ని పిండుకుని అమ్ముకుంటున్న ఈ గ్యాంగ్‌ను స్థానికులు డ్రాకులా గ్యాంగ్ అని పిలుస్తున్నారు. ఈ దారుణం దేవరియా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమా నగర్ కాలనీలో వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా ఈ డ్రాకులా గ్యాంగ్ సభ్యులు మైనర్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒంటరిగా దొరికిన పిల్లలను అడ్డుకుని, అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేయడం ఈ ముఠా పని. ఒకవేళ పిల్లలు డబ్బులు ఇవ్వలేకపోతే, వారిని తీవ్రంగా భయపెట్టి డబ్బులు ఇవ్వలేవా? అయితే నీ రక్తం ఇచ్చి ఆ బాకీ తీర్చుకో అంటూ దారుణమైన షరతులు విధిస్తున్నారు. తుపాకులతో బెదిరిస్తూ పిల్లలను సోనుఘాట్ ప్రాంతంలోని ఒక బ్లడ్ బ్యాంక్‌కు తీసుకువెళ్లి, అక్కడ బలవంతంగా రక్తాన్ని తీయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా సేకరించిన రక్తాన్ని ఆ ముఠా సభ్యులు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.

ఈ భయంకరమైన విషయాన్ని బాధితులైన పిల్లలు తమ ఇంట్లో చెప్పడంతో అసలు విషయం బయటపడింది. గ్యాంగ్ సభ్యులు తమను ఎలా అడ్డగిస్తారో, డబ్బుల కోసం ఎలా వేధిస్తారో, చివరికి బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎలా తీయిస్తారో పిల్లలు కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు కలిసి జిల్లా ఎస్పీ సంజీవ్ సుమన్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే ఎస్పీ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని పోలీసు బృందాలను ఆదేశించారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు ఈ ముఠాతో సంబంధం ఉందా? అసలు పిల్లల రక్తాన్ని ఎలా సేకరించారు? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఉమా నగర్ కాలనీ పరిసరాల్లో ప్రజలు ఇప్పుడు తమ పిల్లలను బయటకు పంపాలంటేనే గజగజ వణికిపోతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని, తమ పిల్లలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ డ్రాకులా ఉదంతం ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది.

CR Reddy

CR Reddy

Next Story