DC vs PBKS : అక్షర్ పటేల్ అసలు సిసలు విశ్వరూపం.. పంజాబ్ పై ఢిల్లీ ఘన విజయం

DC vs PBKS : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అక్షర్ పటేల్ సేన ప్లేఆఫ్ రేసులో నిలిచింది.

CR Reddy
Published on: 12 May 2026 6:04 AM IST
DC vs PBKS
X

DC vs PBKS 

DC vs PBKS : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా రెండు ఓటముల తర్వాత ఢిల్లీ గెలుపు బాట పట్టగా.. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్, వరుసగా నాలుగో ఓటమితో చతికిలపడింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ధర్మశాలలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ ప్రయాన్ష్ ఆర్య కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి బంతికే సిక్సర్‌తో ఖాతా తెరిచిన ఆర్య, కేవలం 2.4 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 దాటించాడు. పవర్‌ప్లేలోనే 24 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ఆర్య (56) పంజాబ్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్), కూపర్ కానోలీ (38) రాణించినప్పటికీ, మధ్య ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో పంజాబ్ వేగం తగ్గింది. చివర్లో సూర్యాంశ్ షెడ్గే 8 బంతుల్లో 21 పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం ఆశాజనకంగా లేదు. పవర్‌ప్లే ముగిసేసరికే కేవలం 33 పరుగులకే ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ధాటికి ఢిల్లీ బ్యాటర్లు విలవిలలాడారు. ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్ పగ్గాలు అందుకున్నాడు. ఈ సీజన్ అంతా బ్యాట్‌తో నిరాశపరిచిన అక్షర్, కీలక సమయంలో కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అతనికి వెటరన్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 51) నుంచి అద్భుతమైన సహకారం లభించింది. వీరిద్దరూ కలిసి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు.

మిల్లర్ అవుటైన తర్వాత పంజాబ్ మళ్లీ రేసులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ ఆశుతోష్ శర్మ 10 బంతుల్లో 24 పరుగులు చేసి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక చివరికి యువ ఆల్ రౌండర్ మాధవ్ తివారీ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఢిల్లీ తన ఐదో విజయాన్ని నమోదు చేయగా, పంజాబ్ వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఇప్పుడు వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఈ ఫలితంతో ప్లేఆఫ్ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story