Kalyan Murder : చంపి.. గోనెసంచిలో కుక్కి బాత్‌రూమ్‌లో దాచింది.!

Kalyan Murder : మహారాష్ట్రలోని థానే జిల్లా, కల్యాణ్‌లో ఒక భయంకరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో కలిసి ఉంటూ, చివరకు ప్రియుడిని..

G Krishna
Published on: 20 July 2026 7:13 PM IST
Kalyan Murder
X

Kalyan Murder

Kalyan Murder : మహారాష్ట్రలోని థానే జిల్లా, కల్యాణ్‌లో ఒక భయంకరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో కలిసి ఉంటూ, చివరకు ప్రియుడిని దారుణంగా హత్య చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోనే దాచిపెట్టిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సుమారు 15 రోజులుగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య చేసిన మహిళా నిందితురాలు కోల్‌కతా పారిపోయినట్లు అధికారులు గుర్తించారు.

రూమ్ నంబర్ 104లో భయంకర దృశ్యం

ఈ దారుణం కల్యాణ్‌లోని మలంగ్ రోడ్డులో ఉన్న నీల్‌కంఠ్ అపార్ట్‌మెంట్‌లోని రూమ్ నంబర్ 104లో జరిగింది. మృతుడిని 37 ఏళ్ల హమీదుల్లా ఇస్లాంగా పోలీసులు గుర్తించారు. నిందితురాలు హసీబాతో కలిసి హమీదుల్లా గత రెండున్నర నెలలుగా ఈ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో, హసీబా పదునైన ఆయుధంతో హమీదుల్లాను దారుణంగా హత్య చేసిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహం బయటపడకుండా ఒక గోనె సంచిలో కట్టి, బాత్‌రూమ్‌లో పడేసింది.

ఆధారాలు తుడిచేసేందుకు 'వాటర్' ప్లాన్!

ఈ హత్య కేసులో నిందితురాలు అత్యంత క్రూరమైన ప్లాన్ అమలు చేసింది. మృతదేహం దాదాపు 15 రోజులుగా అదే బాత్‌రూమ్‌లో ఉంది. హత్య జరిగిన తర్వాత రక్తపు మరకలు, ఇతర ఆధారాలు కొట్టుకుపోవడానికి.. అలాగే మృతదేహం వేగంగా కుళ్ళిపోయేలా చేయడానికి బాత్‌రూమ్‌లోని నల్లాను అలాగే ఆన్ చేసి ఉంచింది. ఈ 15 రోజులు నీళ్లు వరుసగా పారడం వల్ల మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి, భయంకరమైన వాసన బయటకు రావడం మొదలైంది. ఆ ఫ్లాట్ నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, సంచిలో కుళ్ళిన స్థితిలో శవం కనిపించింది.

పోలీసులకు దొరికిన కీలక వాయిస్ మెసేజ్..

ఈ కేసు విచారణలో పోలీసులకు నిందితురాలు పంపిన ఒక 'వాయిస్ మెసేజ్' ప్రధాన ఆధారంగా మారింది. హమీదుల్లాను హత్య చేసిన తర్వాత, ఫ్లాట్‌ను బయట నుంచి లాక్ చేసి కోల్‌కతాకు పారిపోయిన హసీబా.. వెళ్లేముందు ఓనర్ కి ఒక వాయిస్ మెసేజ్ పంపింది. అందులో "బాత్‌రూమ్‌లో శవం ఉంది.. నీళ్లు ఆన్ చేసి వెళ్తున్నాను" అని చాలా కూల్‌గా చెప్పినట్లు తెలిసింది. ఆ మెసేజ్ విన్న యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.

కోల్‌కతాకు ప్రత్యేక టీమ్స్.. గాలింపు మొదలు..

పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు. నిందితురాలు హసీబా కోల్‌కతాకు పారిపోయిందని భావిస్తున్న పోలీసులు, ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అందులో ఒక టీమ్ ఇప్పటికే కోల్‌కతాకు వెళ్లి గాలింపు చేపట్టింది. అసలు హమీదుల్లాను చంపడానికి కారణాలేంటి? వీరి మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితురాలు దొరికితేనే పూర్తి నిజాలు బయటపడే అవకాశం ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story