Kamareddy Crime: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడి దారుణ హత్య!
కామారెడ్డిలో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల బాలుడిని కిరాతకంగా చంపిన నర్సింలు. కళ్లలో కారం కొట్టి, గొంతు పిసికి దారుణ హత్య.
Kamareddy Crime 5 YearOld Boy Murdered by Mothers Lover
జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. కన్నతల్లితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మృగాడు ఐదేళ్ల బాలుడిని అతి కిరాతకంగా హతమార్చాడు. నేలకేసి బాది, కంట్లో కారం కొట్టి, గొంతు పిసికి ప్రాణం తీసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే:
శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ తన భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు నర్సింలు అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. లక్ష్మికి శ్రవణ్ (5) అనే కుమారుడు ఉన్నాడు. వారి అక్రమ సంబంధానికి ఈ బాలుడు అడ్డుగా మారుతున్నాడని నర్సింలు భావించాడు.
శుక్రవారం తల్లి లక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి నర్సింలు బాలుడిపై దాడికి తెగబడ్డాడు. పసివాడని కూడా చూడకుండా నేలకేసి కొట్టి, ప్రతిఘటించకుండా కళ్లలో కారం పొడి చల్లి, గొంతు పిసికి చంపేశాడు. బాలుడు విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




