Karnataka Car Blast : హైవేపై హాలీవుడ్ సీన్.. కర్ణాటకలో హైవేపై కారు బాంబు పేలుడు..
Karnataka Car Blast : కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారిపై సినిమా ఫక్కీలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ నిరాకరించిందని ఒక మహిళను..
Karnataka Car Blast
Karnataka Car Blast : కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారిపై సినిమా ఫక్కీలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ నిరాకరించిందని ఒక మహిళను కిడ్నాప్ చేసిన నిందితుడు.. కదులుతున్న కారులోనే బాంబు పేల్చాడు. మహిళ సమయస్ఫూర్తితో కారులోంచి కిందకు దూకి ప్రాణాలు దక్కించుకోగా, నిందితుడు మాత్రం ఆ శక్తివంతమైన పేలుడులో కారులోనే సజీవ దహనమయ్యాడు. ఈ ఘోర ప్రమాదం బెంగళూరు-పుణె జాతీయ రహదారి-48పై తీవ్ర కలకలం రేపింది.
ప్రేమ విఫలమవడంతో కిడ్నాప్ స్కెచ్
పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నాగేంద్ర (30), బెంగళూరులో ఓటీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఒక మహిళ గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ మహిళ నాగేంద్ర నంబర్‌ను బ్లాక్ చేసి అతనికి దూరంగా ఉంటోంది. దీనిని తట్టుకోలేని నాగేంద్ర, శనివారం ఉదయం బెంగళూరు జయనగర్‌లోని ఆమె అద్దె నివాసానికి వెళ్లి గొడవకు దిగాడు. అనంతరం ఆమెను బలవంతంగా ఒక ఉబెర్ క్యాబ్‌లోకి నెట్టి కిడ్నాప్ చేశాడు. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జయనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కారులోనే కత్తితో దాడి.. బాంబు బెదిరింపులు
క్యాబ్‌లో ఆమెను అంకోలా వైపు తీసుకువెళ్తున్న క్రమంలో.. నిందితుడు నాగేంద్ర తన వెంట తెచ్చుకున్న పేలుడు పరికరాన్ని (బాంబు) ఆమెకు చూపించి భయభ్రాంతులకు గురిచేశాడు. నిన్ను చంపేసి, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కారు సిరా తాలూకాలోని జోగిహళ్లి సమీపానికి రాగానే, నాగేంద్ర కదులుతున్న వాహనంలోనే ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. లోపల జరుగుతున్న గొడవను గమనించిన క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన ఆపాడు. అదే తరుణంలో ఆ మహిళ చాకచక్యంగా కారు తలుపులు అన్‌లాక్ చేసి బయటకు దూకేసింది.
కారును చీల్చేసిన పేలుడు.. కిలోమీటరు మేర జామ్
ఆమె కారు నుంచి కిందకు దూకిన కొద్ది క్షణాల్లోనే.. నాగేంద్ర తన వద్ద ఉన్న బాంబును పేల్చాడు. ఆ పేలుడు ధాటికి కారు ఒక్కసారిగా ముక్కలై, భారీ మంటలు చెలరేగాయి. స్థానికులు రక్షించే లోపే నాగేంద్ర కారులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదంలో కిందకు దూకిన మహిళతో పాటు క్యాబ్ డ్రైవర్ ప్రవీణ్ కూడా గాయపడ్డారు. వారిని వెంటనే తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఈ పేలుడు సంభవించడంతో కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఉద్దేశపూర్వక పేలుడే: ఎస్పీ అశోక్
ఘటనా స్థలాన్ని పరిశీలించిన తుమకూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) అశోక్ కె.వి. మాట్లాడుతూ.. నాగేంద్ర ఉద్దేశపూర్వకంగానే పేలుడు పదార్థాన్ని తెచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఘటనా స్థలం నుండి బాంబు లాంటి పేలుడు పదార్థాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆ బాంబును ఎక్కడి నుండి సేకరించాడు? దాని తీవ్రత ఎంత? అనే కోణంలో ఫోరెన్సిక్ బృందం సహాయంతో కల్లంబెల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.




