Malkajgiri: ఏఐతో మహిళ ఫొటోలు మార్ఫింగ్.. నిందితుడు అరెస్ట్!

Malkajgiri: మహిళ ఫొటోలను ఏఐ సాంకేతికతతో అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితుడిని నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Aug 2026 6:35 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఏఐతో మహిళ ఫొటోలు మార్ఫింగ్.. నిందితుడు అరెస్ట్!

మల్కాజిగిరి: మహిళ ఫొటోలను కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో మార్ఫింగ్ చేసి అసభ్యకర చిత్రాలుగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన కేసులో నేరేడ్‌మెట్ పోలీసులు 26 ఏళ్ల ఆనంద క్రిష్ణన్ అన్బలగన్‌ను అరెస్ట్ చేశారు. క్రైమ్ నంబర్ 243/2026లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 78, సమాచార సాంకేతిక చట్టంలోని 67, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు గతంలో బాధితురాలితో కలిసి పనిచేశాడు.క్యూనెట్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడటంతో బాధితురాలిపై కక్ష పెంచుకున్నాడు.దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఉన్న ఫొటోలను సేకరించి ఏఐ సాంకేతికతతో అసభ్యకర చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. అనంతరం పలు నకిలీ ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఖాతాలను సృష్టించి వివిధ టెలిగ్రామ్ గ్రూపుల్లో వాటిని ప్రచారం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అంతేకాకుండా బాధితురాలి పేరుతో తప్పుడు సందేశాలను పోస్టు చేయడంతో పాటు, ఆమె నివాస ప్రాంతానికి గుర్తుతెలియని వ్యక్తులను పంపించి ఇబ్బందులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. నేర కార్యకలాపాలను దాచేందుకు నిందితుడు పలు టెలిగ్రామ్ ఖాతాలు, చాట్లు, సందేశాలను తొలగించినప్పటికీ సాంకేతిక దర్యాప్తు, డిజిటల్ ఆధారాల ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించారు.

నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును సాంకేతిక ఆధారాలతో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన నేరేడ్‌మెట్ సైబర్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

ప్రజలకు నేరేడ్మెట్ పోలీసుల సూచన వ్యక్తుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం లేదా ఇతరులకు పంపడం చట్టపరంగా నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story