IT Raids : బస్సు డ్రైవర్ ఇంట్లో 35 బస్తాల కరెన్సీ కట్టలు, 15 కిలోల బంగారం.. కంగుతిన్న అధికారులు
IT Raids : పశ్చిమ బెంగాల్ బీర్‌భూమ్‌లో మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
IT Raids
IT Raids : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో ఒక సాధారణ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో సీనియర్ పోలీసు అధికారులు జరిపిన తనిఖీల్లో కళ్లు చెదిరే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇల్లు చూస్తే చాలా సాధారణంగా ఉన్నప్పటికీ, లోపల ఉన్న నల్లధనాన్ని చూసి పోలీసు బృందం మైండ్ బ్లాంక్ అయిపోయింది. సినిమా రేంజ్‌లో జరిగిన ఈ దాడిలో ఏకంగా రూ.20 కోట్ల నగదుతో పాటు 15 కిలోల బంగారు బిస్కట్లు లభ్యమయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
35 బస్తాల్లో నోట్లు.. లెక్కపెట్టలేక ఆగిపోయిన మిషన్లు
పోలీసులు ఇల్లు సోదా చేయగా రూమ్ మూలల్లో ఏకంగా 35 బస్తాల్లో దాచి ఉంచిన నల్లధనం బయటపడింది. ఆ నోట్ల కట్టలను లెక్కించడానికి ప్రత్యేకంగా తెప్పించిన 5 కౌంటింగ్ మిషన్లు నిరంతరాయంగా పనిచేసి చివరికి వేడెక్కి ఆగిపోయాయి. లభ్యమైన భారీ మొత్తంలో నోట్లను, 15 కిలోల బంగారాన్ని సురక్షితంగా తరలించడానికి పోలీసులు పెద్ద పెద్ద 5 ఇనుప పెట్టెలను తెప్పించాల్సి వచ్చింది. గంటల తరబడి లెక్కించినా డబ్బు కట్టలు తగ్గకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
మైనింగ్ మాఫియాతో లింక్
ఈ దాడిలో చిక్కిన మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ పేరు మీనార్ మండల్. ఇతనికి అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. బీర్‌భూమ్ ప్రాంతంలో భారీ ఎత్తున మైనింగ్ వ్యాపారం చేసే క్వారీ యజమాని తులు మండల్‌కు ఈ డ్రైవర్ బావమరిది (భార్య సోదరుడు). అక్రమ మైనింగ్, రాతి క్వారీల ద్వారా సంపాదించిన నల్లధనాన్నంతా ఇతని వద్దే భద్రపరిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముమ్మరంగా సాగుతున్న విచారణ
లభ్యమైన అక్రమ ఆస్తులను, నగదును పోలీసులు సీజ్ చేశారు. నిందితుడిపై ఆర్థిక నేరాలు, అక్రమ ఆస్తుల నిర్మూలన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ నల్లధనం వెనుక ఇంకా ఎంతమంది బడా బాబుల హస్తం ఉందనే విషయమై విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాల్లో, వ్యాపార వర్గాల్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది.




