Gold Theft : డోన్ హైవేపై భారీ చోరీ.. బస్సులో 2.75 కిలోల బంగారం మాయం.!

Gold Theft : నంద్యాల జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై అత్యంత సినిమా స్టైల్‌లో ఒక భారీ దొంగతనం వెలుగుచూసింది. డోన్ హైవేపై ఉన్న ‘భారత్ డాబా’ సమీపంలో..

G Krishna
Published on: 21 Jun 2026 11:47 AM IST
Gold-Theft
X

Gold-Theft

Gold Theft : నంద్యాల జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై అత్యంత సినిమా స్టైల్‌లో ఒక భారీ దొంగతనం వెలుగుచూసింది. డోన్ హైవేపై ఉన్న ‘భారత్ డాబా’ సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు పెద్ద ఎత్తున బంగారాన్ని అపహరించారు. బాధితుడి నుంచి ఏకంగా రూ. 4.50 కోట్ల విలువైన 2.750 కిలోల బంగారాన్ని దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అనంతపురం నుంచి వెంబడించిన 'స్కార్పియో'..

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ చోరీ వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం నుంచి సదరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరినప్పటి నుంచే దొంగలు ఒక 'స్కార్పియో' వాహనంలో దాన్ని వెంబడించారు. బస్సులో భారీ మొత్తంలో బంగారం ఉందనే పక్కా సమాచారంతోనే ఈ ముఠా రంగంలోకి దిగినట్లు అనుమానిస్తున్నారు. బస్సు డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గర ఆగడంతో, దొంగలు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని తమ ప్లాన్‌ను అమలు చేశారు.

జడ్చర్ల చేరాక తెలిసిన అసలు నిజం!

ఈ చోరీ ఎంత పక్కాగా జరిగిందంటే.. బస్సు డోన్ నుంచి బయలుదేరి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చేరుకునే వరకు కూడా దొంగతనం జరిగినట్లు ఎవరూ గుర్తించలేదు. జడ్చర్ల వద్దకు వచ్చిన తర్వాత బాధితుడు మోతిలాల్ తన వద్ద ఉన్న బంగారం బ్యాగ్‌ను సరిచూసుకోగా, అది కనిపించకుండా పోయింది. అప్పటికే దొంగలు డాబా వద్దే సమయం చూసి ఆ బ్యాగ్‌ను నొక్కేసి తమ వాహనంలో పరారయ్యారు. బ్యాగ్ మాయమవడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు మోతిలాల్, వెంటనే వెనక్కి వచ్చి డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు

రూ. 4.50 కోట్ల విలువైన బంగారం చోరీ కావడంతో డోన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. దొంగతనం జరిగినట్లు భావిస్తున్న భారత్ డాబా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే అనంతపురం నుంచి డోన్ వరకు ఉన్న టోల్ గేట్ల వద్ద స్కార్పియో వాహన కదలికలను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. ఇంత పక్కా సమాచారంతో దొంగలు దాడి చేయడం చూస్తుంటే, బాధితుడికి తెలిసిన వారే ఎవరైనా సమాచారం ఇచ్చారా అనే కోణంలోనూ పోలీసులు నిఘా పెట్టారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story