Inder Kaur : పంజాబ్‌లో దారుణం: ప్రముఖ సింగర్ ఇందర్ కౌర్ కిడ్నాప్, దారుణ హత్య!
Inder Kaur : పంజాబ్‌లోని లూధియానాలో జరిగిన ఒక ఘోర సంఘటన స్థానిక సంగీత పరిశ్రమతో పాటు ఆ ప్రాంతమంతటా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది..
punjab singer inder kaur
Inder Kaur : పంజాబ్‌లోని లూధియానాలో జరిగిన ఒక ఘోర సంఘటన స్థానిక సంగీత పరిశ్రమతో పాటు ఆ ప్రాంతమంతటా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆరు రోజుల క్రితం గన్ పాయింట్‌తో బెదిరించి కిడ్నాప్ చేయబడిన ప్రముఖ పంజాబీ గాయని ఇందర్ కౌర్ (యశీందర్ కౌర్) దారుణ హత్యకు గురయ్యారు. కొద్దిరోజులుగా ఆమె కోసం వెతుకుతుండగా, తాజాగా నీలో కాలువ వద్ద ఆమె మృతదేహం లభ్యమవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం సమ్రాలా సివిల్ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
షాపింగ్‌కు వెళ్లి తిరిగి రాని గాయని
ఈ ఘోరానికి సంబంధించిన వివరాలను ఇందర్ కౌర్ సోదరుడు జోతిందర్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 13వ తేదీన రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఇందర్ కౌర్ కొన్ని ఇంటి సరుకులు కొనడం కోసం తన ఫోర్డ్ ఫిగో కారులో లోకల్ మార్కెట్‌కు బయలుదేరింది. అయితే అర్ధరాత్రి దాటినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ కంగారుపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం స్టార్ట్ చేశాక, మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అలియాస్ సుఖాపై వారికి బలమైన అనుమానం కలిగింది. ఇందర్ కౌర్‌ను సుఖ్వీందర్ సింగ్ ఎలాగైనా బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా వేధిస్తున్నాడని, అయితే అందుకు ఇందర్ కౌర్ ఖచ్చితంగా నిరాకరించడంతో అతనిలో తీవ్ర కక్ష, ఆగ్రహం పెరిగాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కెనడా నుండి వచ్చి మరీ ఘాతుకం
నిందితుడైన సుఖ్వీందర్ సింగ్ కెనడాలో ఉంటున్నాడని, ఇందర్ కౌర్‌పై పగ తీర్చుకోవడానికే అతను ప్రత్యేకంగా పంజాబ్‌కు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం సుఖ్వీందర్ తన గ్యాంగ్ సభ్యులతో కలిసి మార్గమధ్యంలో ఇందర్ కౌర్ కారును అడ్డుకున్నాడు. అందరి ముందే గన్ చూపించి, తుపాకీతో బెదిరించి ఆమెను దారుణంగా అపహరించాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయడం కోసం శవాన్ని నీలో కాలువలో పడేశారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వెంటనే మెయిన్ విలన్ సుఖ్వీందర్ సింగ్ ఇండియా నుండి మళ్లీ కెనడాకు పారిపోవడం గమనార్హం.
పోలీసుల నిర్లక్ష్యంపై ఫ్యామిలీ ఆగ్రహం
ఈ కేసులో పోలీసుల పనితీరుపై ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రధాన నిందితుడు సుఖ్వీందర్ సింగ్, అతని అనుచరుడు కరమ్‌జిత్ సింగ్‌లపై మే 15నే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినప్పటికీ, అఫీషియల్స్ సకాలంలో స్పందించి ఎలాంటి సీరియస్ యాక్షన్స్ తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు గనుక ముందే అలర్ట్ అయి ఉంటే నిందితుడు దేశం విడిచి పారిపోయేవాడు కాదని, ఇందర్ కౌర్ ప్రాణాలైనా దక్కేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఇన్సిడెంట్‌పై జమాల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ తాము ఇప్పటికే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్‌తో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని స్పష్టం చేశారు.




