చేతులు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి హత్య.. నగలతో పరారీ

హైదరాబాద్‌లో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌ రే భార్య హత్య కలకలం రేపింది. పనిమనిషి సహా ముగ్గురు పరారీ.

Ramya Vegirouthu
Published on: 9 May 2026 7:50 AM IST
Retired IPS Vinay Ranjan Ray Wife Murdered in Hyderabad
X

Retired IPS Vinay Ranjan Ray Wife Murdered in Hyderabad

IPS Officer Wife Murder: హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వినయ్‌రంజన్‌ రే భార్య తనూజ(60)ను ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనిషి కల్పన, మరో ఇద్దరితో కలిసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దోపిడీ కోసం ముందుగా పథకం రచించిన నిందితులు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను హతమార్చి నగదు, నగలతో పరారయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1986 బ్యాచ్‌కు చెందిన వినయ్‌రంజన్‌ రే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేసి 2019లో డీజీపీ స్థాయిలో పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితం వృద్ధ తల్లిని చూసుకునేందుకు నేపాలీ మహిళ కల్పనను పనిలో పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం రే తల్లి మరణించినప్పటికీ ఆమెపై నమ్మకం ఉండటంతో ఉద్యోగంలో కొనసాగించారు.

కొద్దిరోజుల క్రితం వినయ్‌రంజన్‌ రే వైద్య చికిత్స కోసం బెంగళూరు వెళ్లగా, ఇదే అవకాశంగా భావించిన కల్పన తన ఇద్దరు సహచరులను హైదరాబాద్‌కు రప్పించింది. ఇంటి పరిసర ప్రాంతాలను పలుమార్లు పరిశీలించి, అర్ధరాత్రి సమయంలో పార్కు వైపు ఉన్న గేటు ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు.

గురువారం అర్ధరాత్రి తర్వాత ముగ్గురు కలిసి తనూజ గదిలోకి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరవకుండా చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం ఇంట్లోని నగదు, బంగారు నగలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

శుక్రవారం ఉదయం వరకు తనూజ బయటకు రాకపోవడంతో కుమార్తెలు గదిలోకి వెళ్లి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఘటనాస్థలం సమీపంలో రెండు సెల్‌ఫోన్లు, టోపీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story