Sircilla: ఆస్తి కోసం మేనమామను బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి రిమాండ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన మేనమామ రాగుల ఎల్లయ్య హత్య కేసును టౌన్ పోలీసులు ఛేదించారు.

KALEEM, SIRICILLA
Published on: 11 July 2026 10:58 PM IST
Sircilla
X

Sircilla: ఆస్తి కోసం మేనమామను బండరాయితో కొట్టి చంపిన వ్యక్తి రిమాండ్!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన మేనమామ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యానికి బానిసైన వ్యక్తి, తన మేనమామను హత్య చేసి ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, హత్యకు ఉపయోగించిన బండరాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం.సిరిసిల్లకు చెందిన పుప్పాల శ్రీకాంత్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు పెరిగి, ఆరు సంవత్సరాల క్రితమే భార్య ఇద్దరు పిల్లలతో విడిచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత తల్లితో కలిసి ఉంటూ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తరచూ వేధించేవాడు. ఐదు నెలల క్రితం తన తల్లిని వేధిస్తున్నాడని మేనమామ రాగుల ఎల్లయ్య అందరి ఎదుట మందలించి, కొట్టడంతో తీవ్ర అవమానంగా భావించిన శ్రీకాంత్.అప్పటి నుంచే హత్యకు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

మేనమామకు భార్యా పిల్లలు లేకపోవడంతో, హత్య చేస్తే ఇల్లు తనకు దక్కుతుందని, ఆ ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

జూలై 4న మార్కెట్‌లో మేనమామను కలిసిన శ్రీకాంత్.పెద్దూరు శివారుకు తీసుకెళ్లి కల్లు, మద్యం తాగించాడు. బాధితుడు మత్తులోకి వెళ్లిన తర్వాత గొంతు నులిమేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించడంతో, సమీపంలోని బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని పాత బట్టలతో కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

తర్వాత మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలుసుకుని హైదరాబాద్‌కు పారిపోతుండగా, సిరిసిల్ల ఎల్లమ్మ చౌక్ వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బండరాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story