POCSO Case: 15 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లల తల్లి.. కేసు నమోదు చేసిన పోలీసులు
POCSO Case: భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మహిళ 15 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడి గుడిలో పెళ్లి చేసుకున్న సంచలన ఘటన బీహార్‌లోని పాట్నాలో వెలుగు చూసింది.
POCSO Case
POCSO Case: భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఒక మహిళ 15 ఏళ్ల మైనర్ బాలికతో ప్రేమలో పడి గుడిలో పెళ్లి చేసుకున్న సంచలన ఘటన బీహార్‌లోని పాట్నాలో వెలుగు చూసింది. ఈ కేసులో సదరు మహిళపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సుపౌల్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పాట్నాలోని దీఘా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. భర్త దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో పొరుగునే నివసిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలికతో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. రోజూ ఒకరినొకరు కలుసుకోవడం, మాట్లాడుకోవడంతో ఆ పరిచయం కాస్తా మోజుగా మారింది. ఈ బంధం ఎంతవరకు వెళ్లిందంటే, సుమారు రెండు నెలల క్రితం ఆ మహిళ ఆ చిన్నారిని తీసుకుని ఇల్లు వదిలి పారిపోయింది. అనంతరం ఇద్దరూ ఒక గుడిలో వివాహం చేసుకున్నారు.
జైలు నుంచి వచ్చి మళ్లీ అదే పని
బాలిక కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు దీఘా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి బాలికను సురక్షితంగా రక్షించారు. సదరు మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ ఏమాత్రం మారలేదు. జైలు నుంచి విడుదలైన కేవలం నాలుగు రోజులకే మళ్లీ ఆ మైనర్ బాలికను తీసుకుని పారిపోయింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన బాలిక తల్లి శనివారం మరోసారి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల మెరుపు దాడి.. ఆరాలో ఆచూకీ
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితురాలి పాత స్థావరాలపై దాడులు నిర్వహించారు. భోజ్‌పూర్ జిల్లాలోని ఆరా ప్రాంతంలో వీరిద్దరూ దాక్కున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. అదే సమయంలో నిందితురాలైన మహిళను అరెస్ట్ చేసి పాట్నాకు తరలించారు.
మహిళపై పొక్సో కేసు.. న్యాయస్థానంలో హాజరు
సాధారణంగా పురుషులపై నమోదయ్యే పొక్సో కేసు, ఈ వింత ఘటనలో ఒక మహిళపై నమోదు కావడం చట్టపరంగా అరుదైన విషయమని పోలీసులు చెబుతున్నారు. రక్షించిన బాలికను తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా అప్పగించారు. నిందితురాలైన మహిళను సోమవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించి జైలుకు పంపించింది.




