Narsapur: ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్.. ఒకరు మృతి!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బోనాల జాతర ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Narsapur: ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్.. ఒకరు మృతి!
Narsapur: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బోనాల జాతర ఏర్పాట్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతర ప్రారంభానికి ముందే జరిగిన ప్రమాదం పట్టణంలో విషాదాన్ని నింపింది. బోనాల జాతర ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల వివరాల ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన మల్పర్తి హర్షవర్ధన్ (19) శుక్రవారం తెల్లవారుజామున బోనాల జాతర ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్లెక్సీకి సంబంధించిన ఇనుప పైపు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
బలమైన విద్యుత్ షాక్‌కు గురైన హర్షవర్ధన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరో రెండు రోజుల్లో నర్సాపూర్ పట్టణంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్న వేళ ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. జాతర ఏర్పాట్లలో విద్యుత్ తీగల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.




