AI Jobs: వచ్చే రెండేళ్లలో పరిస్థితులు మాములుగా ఉండవు.. 99 శాతం కంపెనీలు ఆందోళన
AI Jobs: కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఉద్యోగ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించింది.
AI Jobs: వచ్చే రెండేళ్లలో పరిస్థితులు మాములుగా ఉండవు.. 99 శాతం కంపెనీలు ఆందోళన
AI Jobs: కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఉద్యోగ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించింది. ముఖ్యంగా రానున్న రెండేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తుందని 99 శాతం మంది కంపెనీ యాజమాన్య ప్రతినిధులు భావిస్తున్నట్లు మెర్సర్ (Mercer) విడుదల చేసిన గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్ రిపోర్ట్ పేర్కొంది.
ఉద్యోగాలపై పెరుగుతోన్న ఏఐ ప్రభావం
ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేల మంది వ్యాపార సంస్థల ప్రతినిధులు, హెచ్‌ఆర్ నిపుణులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రిపోర్టు ప్రకారం, ప్రస్తుతం కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగులను గుర్తించడం పెద్ద సవాల్‌గా మారింది. అదే సమయంలో AI కారణంగా ఉద్యోగుల్లో కొంతమందిని తగ్గించాల్సి వస్తుందని 99 శాతం మంది వ్యాపార సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
అలాగే 60 శాతం మంది హెచ్‌ఆర్ నిపుణులు, వచ్చే రెండేళ్లలో తమ సంస్థల్లో 11 నుంచి 20 శాతం మంది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పాల్సి వస్తుందని లేదా ఇతర బాధ్యతలకు మార్చాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు 40 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఏడాదిలోనే తమ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సర్వే వెల్లడించింది.
కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికే ఎక్కువ ప్రమాదం
ఈ నివేదికలో ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. కొత్తగా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరే యువత చేసే అనేక పనులను ఇప్పుడు AI సులభంగా చేయగలుగుతోంది. దీంతో అనేక కంపెనీలు జూనియర్ స్థాయి ఉద్యోగాల భర్తీని తగ్గిస్తున్నాయి. గత ఏడాది 17 శాతం కంపెనీలు మాత్రమే ఎంట్రీ లెవల్ పోస్టులను తగ్గించాలని భావించగా, ఇప్పుడు ఆ సంఖ్య 43 శాతానికి పెరిగింది. ముఖ్యంగా 22 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువ ఉద్యోగులు ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
AI వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం ఉద్యోగుల్లో వేగంగా పెరుగుతోంది. 2024లో ఉద్యోగుల్లో 28 శాతం మంది మాత్రమే AI కారణంగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 2026 నాటికి ఈ సంఖ్య 40 శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారడంతో పాటు కెరీర్ అవకాశాలపై కూడా ప్రభావం పడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, AIను పోటీగా కాకుండా కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశంగా ఉపయోగించుకుంటే భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. అందుకే యువత సాంకేతిక నైపుణ్యాలు, AI టూల్స్ వినియోగం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.




