Viral: రూ. 5 వేల నుంచి రూ. 3.75 లక్షల వరకు.. ఇది చూస్తే నిరాశ కూడా హుష్‌కాకి అనాల్సిందే

Viral: నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే తపన ఉంటే చాలని బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ నిరూపించాడు.

Ravi
By Ravi
Updated on: 21 Jun 2026 2:24 PM IST
Viral
X

Viral: రూ. 5 వేల నుంచి రూ. 3.75 లక్షల వరకు.. ఇది చూస్తే నిరాశ కూడా హుష్‌కాకి అనాల్సిందే

Viral: ఐటీ రంగంలో భారీ ప్యాకేజీలు అందుకోవాలంటే కచ్చితంగా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివి ఉండాలని, ఉన్నత చదువులు ఉంటేనే లక్షల కొద్దీ జీతం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, పెద్ద జీతం రావాలంటే ఉన్నత చదువులే అవసరం లేదని, చేస్తున్న పనిలో కమిట్‌మెంట్ ఉంటే చాలని ఒక వ్యక్తి తన జీవితం ద్వారా నిరూపించాడు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సాధించిన వేతన వృద్ధికి సంబంధించిన వివరాలను చెబుతూ బెంగళూరుకు చెందిన ఒక టెక్కీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. నిరాశతో ఉన్న ఎంతోమంది యువతకు ఈ పోస్ట్ ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఉన్నత చదువులు చదవని ఆ యువకుడు కేవలం కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లొమా మాత్రమే పూర్తి చేశాడు. అనంతరం 2013వ సంవత్సరంలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ సమయంలో అతనికి వచ్చిన జీతం ఏటా కేవలం రూ. 60,000(అంటే నెలకు రూ. 5 వేలు మాత్రమే). డిప్లొమా అర్హతతో తొలుత ఒక కంపెనీలో జూనియర్ వెబ్ డెవలపర్‌గా చేరిన అతను, జీతం తక్కువని ఏనాడూ నిరాశ పడలేదు. కేవలం తన పనిపై మాత్రమే దృష్టి పెట్టి, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రారంభించాడు. అలా 2013లో నెలకు 5 వేలతో మొదలైన అతని ప్రయాణం, కఠోర శ్రమ తర్వాత ఇప్పుడు ఏకంగా ఏటా రూ. 45 లక్షల భారీ ప్యాకేజీకి చేరుకుంది.

ఈ అద్భుతమైన కెరీర్ గ్రోత్ వెనుక ఉన్న రహస్యాన్ని కూడా ఆ టెక్కీ తన పోస్ట్‌లో వివరించాడు. జూనియర్ వెబ్ డెవలపర్‌గా పని ప్రారంభించిన తర్వాత, ఐటీ రంగంలో వస్తున్న మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తన స్కిల్స్ ఎప్పటికప్పుడు మరింతగా పెంచుకుంటూ వెళ్లానని అతను తెలిపాడు. అలా నైపుణ్యాలు పెంచుకుంటూ సంస్థలో ప్రమోషన్లు పొందుతూ, అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఏకంగా ఒక టీమ్ లీడ్ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పుకొచ్చాడు. డిగ్రీలు లేవని బాధపడేకంటే, మారుతున్న కాలంతో పాటు మనల్ని మనం ఎలా అప్‌గ్రేడ్ చేసుకుంటున్నామనేదే కెరీర్ గ్రోత్‌ను నిర్దేశిస్తుందని ఈ వైరల్ పోస్ట్ నిరూపిస్తోంది.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story