Jobs: 2030 నాటికి ఈ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు రానున్నాయి.. తాజా నివేదిక‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Jobs: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా విస్తరిస్తోంది.

Mokshith
Published on: 6 Aug 2026 11:34 AM IST
Jobs
X

Jobs: 2030 నాటికి ఈ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు రానున్నాయి.. తాజా నివేదిక‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు

Jobs: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న డిమాండ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కొత్త సాంకేతికతలతో ఈ రంగం దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పించే పరిశ్రమల్లో ఒకటిగా మారనుంది. టాలెంట్ సంస్థ Adecco India విడుదల చేసిన నివేదికలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

కార్లకే పరిమితం కాదు..

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఎక్కువగా కార్లనే భావించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారుతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కమర్షియల్ వాహనాలు, బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థల్లో కూడా EVల వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ రంగం కేవలం వాహనాల తయారీతోనే ఆగిపోకుండా బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ రీసైక్లింగ్, ఎలక్ట్రానిక్స్, ఇంధన వ్యవస్థలు వంటి అనుబంధ రంగాలకు కూడా విస్తరిస్తోంది.

ప్రత్యక్ష, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి

నివేదిక ప్రకారం, 2030 నాటికి ఏర్పడే ఉద్యోగాల్లో 10 నుంచి 15 శాతం వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు ఉంటాయి. మిగిలిన 85 నుంచి 90 శాతం ఉద్యోగాలు పరోక్షంగా EV రంగానికి అనుబంధ పరిశ్రమల్లో లభిస్తాయి. సరఫరా వ్యవస్థ (సప్లై చైన్), సర్వీస్ సెంటర్లు, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ, లాజిస్టిక్స్, నిర్వహణ వంటి రంగాల్లో భారీగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

100కుపైగా సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ నివేదిక రూపొందించారు. రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీ ఉద్యోగాలతో పాటు బ్యాటరీ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్, సెమీకండక్టర్లు, మోటార్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో నిపుణుల అవసరం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.

భారత్‌కు ప్రపంచ EV మార్కెట్లో మరింత అవకాశం

Adecco India జనరల్ స్టాఫింగ్ విభాగాధిపతి దీపేశ్ గుప్తా మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ ప్రయాణికుల EV మార్కెట్లో భారత్ వాటా సుమారు 4 శాతం మాత్రమేనని తెలిపారు. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో భారత్ వాటా 17 శాతానికి చేరిందని చెప్పారు.

దేశంలో తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు నైపుణ్యం కలిగిన సిబ్బందిని మరింతగా తయారు చేస్తే, ప్రపంచ EV సరఫరా వ్యవస్థలో భారత్ కీలక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కొత్త EV విధానాలను అమలు చేస్తున్నాయని కూడా వెల్లడించారు.

మొదట కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. తర్వాత శాశ్వత అవకాశాలు

నివేదిక ప్రకారం, ప్రారంభ దశలో EV రంగంలో వచ్చే ఉద్యోగాల్లో 40 నుంచి 50 శాతం వరకు కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ స్టాఫింగ్ రూపంలో ఉండే అవకాశం ఉంది. అయితే అనుభవం పెరిగే కొద్దీ వీటిలో చాలా ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలుగా మారే అవకాశముందని పేర్కొంది.

బ్యాటరీ రీసైక్లింగ్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2022-26 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మార్కెట్ వార్షిక సగటు వృద్ధి రేటు (CAGR) 55 శాతం నమోదైనట్లు నివేదిక తెలిపింది. అలాగే EV ఛార్జింగ్ మౌలిక వసతులకు సంబంధించిన రంగాల్లో వచ్చే పదేళ్లలో 45 శాతం వరకు కొత్త నైపుణ్యాలున్న ఉద్యోగుల అవసరం పెరగవచ్చని అంచనా వేసింది.

EV రంగం విస్తరణతో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత బలం చేకూరడమే కాకుండా, దిగుమతి చమురుపై ఆధారపడటం తగ్గి, దేశ ఇంధన భద్రత మెరుగుపడుతుందని నివేదిక పేర్కొంది. అంతేకాదు, 2070 నాటికి నెట్-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో కూడా EV రంగం కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషించింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story