EV Mechanic Course India: ఈ కోర్సుకు భారీ డిమాండ్‌...కోటీశ్వరులు అయ్యేందుకు ఇదే మంచి ఛాన్స్‌

EV Mechanic Course India: భారతదేశంలో పలు సంస్థలు ఈవీ టెక్నాలజీపై ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ వంటి సంస్థలు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి.

Balachander
Published on: 5 April 2026 10:00 AM IST
EV Mechanic Course India
X

EV Mechanic Course India: ఈ కోర్సుకు భారీ డిమాండ్‌...కోటీశ్వరులు అయ్యేందుకు ఇదే మంచి ఛాన్స్‌ 

EV Mechanic Course India: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈవీ మెకానిక్‌లకు డిమాండ్‌ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్‌ డీజిల్‌ వాహనాల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వైపుకు ప్రజలు మరలుతున్నారు. ఇది యువతకు ఓ కొత్త అవకాశాన్ని తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. సరైన శిక్షణ, నైపుణ్యాలను పెంచుకుంటే ఈ రంగంలో మంచి ఆదాయం సంపాదించే అవకాశాలు విస్తారంగా ఉన్నాయి.

ఈవీ మార్కెట్‌

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్‌ ముందు వరసలో ఉంది. ప్రస్తుతం దేశంలో ఈవీ మార్కెట్‌ 40 శాతం వృద్ది రేటుతో ముందుకు సాగుతోంది. 2030 నాటికి దేశంలో మొత్తం వాహనాల్లో ఈవీ వాహనాలు 30 శాతం వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల టెక్నిషియన్లు లక్షల సంఖ్యలో అవసరమౌతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యువతకు ఇదే మంచి అవకాశమని అంటున్నారు. ఇక ఈవీ టెక్నీషియన్‌గా మారాలంటే ముందుగా ప్రాథమిక టెక్నికల్ పరిజ్ఞానం అవసరం. ఇందుకోసం ఐటీఐలో ఎలక్ట్రిషియన్, మెకానిక్ మోటార్ వెహికల్ వంటి కోర్సులు చేయడం మంచిది. ఈ కోర్సులు సాధారణంగా 1 నుండి 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తవుతాయి. తరువాత ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలపై 3 నుంచి 6 నెలల ప్రత్యేక శిక్షణ తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

ప్రత్యేక కోర్సులు

భారతదేశంలో పలు సంస్థలు ఈవీ టెక్నాలజీపై ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ వంటి సంస్థలు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నాయి. అలాగే పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్లు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , చార్జింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్‌లపై కోర్సులు అందిస్తున్నాయి. అయితే, కోర్సు పూర్తి చేసినంత మాత్రన సరిపోదు. ఈ రంగంలో ప్రాక్టికల్‌ అనుభవం కూడా చాలా ముఖ్యం. ఈవీ సర్వీస్‌ సెంటర్లలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. ఈ రంగంలో కనీసం 6 నెలల అనుభవం ఉంటే నెలకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు జీతం లభించే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగే కొలది జీతం కూడా భారీగా పెరుగుతుంది.

సర్వీస్‌ సెంటర్లు

ఉద్యోగంతో ఆగిపోకుండా మారుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈవీ సర్వీస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తే అదనంగా మరికొంత ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాదు, చిన్నపట్టణాల్లో కూడా ఈవీ వాహనాల వినియోగం పెరుగుతున్నది. చిన్న పట్టణాల్లో సుమారు రూ. 2 నుంచి రూ. 5 లక్షల పెట్టుబడితో చిన్నస్థాయి సర్వీస్‌ సెంటర్‌ ప్రారంభించినా మంచి ఆదాయం లభిస్తుంది. ఇక ప్రభుత్వం కూడా ఈవీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ రంగంలో సరైన దిశలో కృషి చేస్తే స్థిరమైన ఆదాయంతో పాటు కోటీశ్వరులుగా కూడా మారే అవకాశం ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story