NEET: నీట్ పేపర్ లీక్‌లో కొత్త ట్విస్ట్.. ఇంతకీ పేపర్ బయటకు ఎలా వచ్చిందంటే.?
NEET: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
NEET: నీట్ పేపర్ లీక్‌లో కొత్త ట్విస్ట్.. ఇంతకీ పేపర్ బయటకు ఎలా వచ్చిందంటే.?
NEET: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పరీక్షకు ముందే ప్రశ్నపత్రం కొందరి చేతుల్లోకి చేరిందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ మొత్తం వ్యవహారం బయటపడటానికి ఒక హాస్టల్ నిర్వాహకుడు, కెమిస్ట్రీ అధ్యాపకుడు కలిసి చేసిన ఫిర్యాదే కారణమని అధికారులు చెబుతున్నారు.
పరీక్షకు ముందే విద్యార్థికి చేరిన పీడీఎఫ్
రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ విద్యార్థి ప్రస్తుతం కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నీట్ పరీక్షకు ముందు రోజు రాత్రి అతడికి స్నేహితుడి నుంచి పీడీఎఫ్ రూపంలో ఒక “గెస్ పేపర్” వచ్చింది. అందులో ఉన్న ప్రశ్నలు అసలు పరీక్షకు ఉపయోగపడవచ్చని భావించిన ఆ విద్యార్థి, దాన్ని వెంటనే తన తండ్రికి పంపించాడు.
ఆ విద్యార్థి తండ్రి సికార్‌లో హాస్టల్ నిర్వహిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ ఫైల్‌ను పరిశీలించిన ఆయనకు అనుమానం రావడంతో తనకు పరిచయం ఉన్న కెమిస్ట్రీ అధ్యాపకుడిని సంప్రదించాడు. అప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది.
అసలు ప్రశ్నపత్రంతో పోల్చితే షాక్
పరీక్ష ముగిసిన తర్వాత అసలు ప్రశ్నపత్రాన్ని తీసుకుని ఆ అధ్యాపకుడు, ముందుగా వచ్చిన పీడీఎఫ్‌తో పోల్చి చూశాడు. అందులో దాదాపు 108 ప్రశ్నలు ఒకేలా ఉండటం చూసి ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా బయాలజీ విభాగంలోనూ పెద్ద సంఖ్యలో ప్రశ్నలు మ్యాచ్ కావడంతో ఇది సాధారణ “గెస్ పేపర్” కాదని వారు గుర్తించారు.
దీంతో వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించినా మొదట కేసు నమోదు చేయలేదని సమాచారం. ఆ తర్వాత హాస్టల్ యజమాని, కెమిస్ట్రీ టీచర్ కలిసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి పూర్తి వివరాలతో మెయిల్ పంపించారు. ఈ ఫిర్యాదు తర్వాతే కేంద్ర సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఇంటెలిజెన్స్ రంగంలోకి.. లీక్ గుట్టు రట్టు
ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న ఎన్‌టీఏ, దర్యాప్తులో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సహాయం కోరింది. వారి సూచనలతో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) విచారణ ప్రారంభించింది. విచారణలో ప్రశ్నపత్రం ముందుగానే కొందరి చేతుల్లోకి వెళ్లినట్లు ఆధారాలు బయటపడ్డాయి. భద్రతా కారణాల వల్ల.. ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన హాస్టల్ నిర్వాహకుడు, అతని కుమారుడు, అలాగే కెమిస్ట్రీ అధ్యాపకుడి వివరాలను అధికారులు రహస్యంగా ఉంచారు. ప్రస్తుతం వీరికి ప్రత్యేక రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది.
వైద్యుడి నుంచి పేపర్ కొనుగోలు.. పలురాష్ట్రాలకు చేరిన లీక్
దర్యాప్తులో భాగంగా రాజస్థాన్‌లోని జమ్వా రామ్‌గఢ్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ బివాల్ అనే ఇద్దరు సోదరుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు ఏప్రిల్ 26న గురుగ్రామ్‌కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాన్ని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరి కుమారుడు నీట్‌కు సిద్ధమవుతుండటంతో ముందుగా అతడికి ఆ పేపర్ అందించారు. అనంతరం అదే ప్రశ్నపత్రాన్ని మరికొందరికి విక్రయించినట్లు విచారణలో తేలింది. బిహార్, హరియాణా, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలకు కూడా ఈ లీక్ చేరినట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వివాదం చెలరేగడంతో నీట్ పరీక్షను ఎన్‌టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే.




