NEET UG 2026 Counselling: నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 4 నుంచి తొలి విడత ప్రారంభం. రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, రిపోర్టింగ్ తేదీలు ఇవే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Aug 2026 2:00 AM IST
NEET UG Counselling 2026
X

NEET UG Counselling 2026

నీట్ యూజీ-2026లో అర్హత సాధించి మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 15 శాతం అఖిల భారత కోటా (AIQ) సీట్లతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్‌, జిప్‌మర్‌ (పుదుచ్చేరి, కరైకల్‌)లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఎంసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది కౌన్సెలింగ్‌ను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రాల పరిధిలోని 85 శాతం స్టేట్‌ కోటా సీట్ల భర్తీని ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్‌ కమిటీలు ప్రత్యేకంగా చేపట్టనున్నాయి.

తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 12 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో పాటు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 6 నుంచి 13 వరకు ఛాయిస్‌ ఫిల్లింగ్‌, ఛాయిస్‌ లాకింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

ఆగస్టు 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టగా, తొలి విడత సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితాలను ఆగస్టు 17న ప్రకటించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 18 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

నీట్‌ యూజీ-2026 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌, ఛాయిస్‌ ఫిల్లింగ్‌, సీట్‌ అలాట్‌మెంట్‌, రిపోర్టింగ్‌ తేదీలను ముందుగానే గుర్తుంచుకుని, అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story