NEET UG 2026 Results: ఆల్ ఇండియా ర్యాంక్-1 సాధించిన ఆర్యన్ గుప్తా.. క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనేదే లక్ష్యం!

NEET UG 2026 Results: నీట్-యూజీ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హరియాణాకు చెందిన పాన్షుల్ బన్సల్ 715 మార్కులతో ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచారు.

Arun Chilukuri
Published on: 17 July 2026 12:07 PM IST
NEET UG 2026 Results
X

NEET UG 2026 Results: ఆల్ ఇండియా ర్యాంక్-1 సాధించిన ఆర్యన్ గుప్తా.. క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనేదే లక్ష్యం!

NEET UG 2026 Results: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2026) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది పరీక్ష రాసిన అభ్యర్థుల్లో రికార్డు స్థాయిలో 11.21 లక్షల మంది వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హరియాణాకు చెందిన పాన్షుల్ బన్సల్ చెరో 715 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్లుగా నిలిచారు.

టాపర్ల స్కోర్లు.. సరికొత్త రికార్డులు

ఈ ఏడాది ఫలితాల్లో టోటల్ 720 మార్కులకు గానూ టాపర్లు ఇద్దరూ 715 మార్కులు కైవసం చేసుకున్నారు. వీరితో పాటు మరో 19 మంది విద్యార్థులు 700 మార్కులు సాధించగా, 138 మంది అభ్యర్థులు 690 మార్కులు సాధించారు. విశేషం ఏంటంటే.. 690 కంటే ఎక్కువ మార్కులు సాధించిన 138 మందిలో 93 శాతం మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.

క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనేదే లక్ష్యం: AIR-1 ఆర్యన్ గుప్తా

నీట్-యూజీ 2026లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR 1) సాధించిన ఆర్యన్ గుప్తా వైద్యుల కుటుంబం నుంచి వచ్చాడు. తన విజయంపై స్పందిస్తూ.. "ఇదంతా ఒక కలలా ఉందంటూ" సంతోషం వ్యక్తం చేశాడు. రోజుకు 16 నుండి 17 గంటల పాటు నిరంతరం కష్టపడి చదివానని, ఉపాధ్యాయులను గుడ్డిగా నమ్మడమే తన విజయ రహస్యమని ఆర్యన్ తెలిపాడు.

భవిష్యత్తులో తాను ఒక అంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. తాను మూడో తరగతిలో ఉన్నప్పుడు తన నానమ్మ క్యాన్సర్‌తో మరణించిందని, అప్పుడే క్యాన్సర్ డాక్టర్ కావాలని సంకల్పం తీసుకున్నట్లు ఆర్యన్ భావోద్వేగంగా పంచుకున్నాడు.

వివాదాలు.. రీ-ఎగ్జామ్ నడుమ ఫలితాలు

మే 3వ తేదీన జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షపై పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో తీవ్ర వివాదం రేగింది. దీంతో ఈ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ప్రస్తుతం ఈ లీకేజీ ఉదంతంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు జరుపుతోంది. ఆ తర్వాత జూన్ 21న దేశవ్యాప్తంగా 13 భాషల్లో నీట్ పరీక్షను తిరిగి నిర్వహించారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా నీట్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.

రాష్ట్రాల వారీగా టాపర్లు

ఈ ఏడాది అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి 1.7 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించగా, లక్షద్వీప్ నుండి అత్యల్పంగా 43 మంది క్వాలిఫై అయ్యారు. 705 కంటే ఎక్కువ మార్కులు సాధించిన టాప్ 17 మంది విద్యార్థులు ఎనిమిది రాష్ట్రాల (పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు తమిళనాడు) నుంచి ఉన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story