NEET Exam: మళ్లీ నీట్ పరీక్ష.. అధికారిక తేదీ ప్రకటన వచ్చేసింది
NEET Exam: ప్రశ్నపత్రం లీక్ వివాదంతో రద్దైన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.
NEET Exam: మళ్లీ నీట్ పరీక్ష.. అధికారిక తేదీ ప్రకటన వచ్చేసింది
NEET Exam: ప్రశ్నపత్రం లీక్ వివాదంతో రద్దైన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ రీ-ఎగ్జామ్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహణ
నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ను జూన్ 21న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థులు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్, ఎన్‌టీఏ నోటిఫికేషన్లను మాత్రమే పరిశీలించాలని సూచించింది.
23 లక్షల మందిపై ప్రభావం
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష జరిగింది. అయితే ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు రావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. దీంతో సుమారు 23 లక్షల మంది విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రీ-ఎగ్జామ్ కోసం మళ్లీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదని, ఎలాంటి అదనపు ఫీజు కూడా చెల్లించాల్సిన పనిలేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
పేపర్ లీక్ వ్యవహారం ఎలా బయటపడింది.?
రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతంలో ఈ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. పరీక్షకు ముందు కొంతమంది విద్యార్థులకు ‘గెస్ పేపర్’ పేరుతో ప్రశ్నలు అందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ గెస్ పేపర్‌లో ఉన్న అనేక కెమిస్ట్రీ ప్రశ్నలు అసలు పరీక్షలో రావడం అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు ప్రశ్నల క్రమం, ఆప్షన్లు కూడా ఒకే విధంగా ఉండటంతో లీక్ జరిగిందనే అనుమానం బలపడింది.
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
నీట్ పేపర్ లీక్ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దర్యాప్తు ప్రకారం మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్, హరియాణా, జమ్మూ కశ్మీర్, కేరళ వంటి పలు రాష్ట్రాలకు ప్రశ్నపత్రం చేరినట్లు సమాచారం. ఈ పేపర్ కోసం కొంతమంది విద్యార్థుల నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థుల్లో ఆందోళన.. భవిష్యత్తుపై దృష్టి
పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నెలల తరబడి సిద్ధమైన పరీక్ష మళ్లీ రాయాల్సి రావడం మానసిక ఒత్తిడిని పెంచుతోంది. అయితే పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌టీఏ హామీ ఇస్తోంది. ఈసారి కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. విద్యార్థులు ప్రశాంతంగా సిద్ధమై అధికారిక ప్రకటనలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.




