SBI Jobs: ఎస్‌బీఐలో కొత్తగా 12 వేల నియామకాలు.. 250 కొత్త బ్రాంచ్‌లు!

SBI Jobs: ఎస్‌బీఐలో 12 వేల కొత్త ఉద్యోగాల నియామకాలు. క్లర్క్, ఆఫీసర్ కేడర్లలో భర్తీతో పాటు 250 కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 3:07 PM IST
SBI Jobs
X

SBI Jobs: ఎస్‌బీఐలో కొత్తగా 12 వేల నియామకాలు.. 250 కొత్త బ్రాంచ్‌లు!

SBI Jobs: ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ సేవల విస్తరణలో భాగంగా కొత్తగా 12,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా కొత్తగా 250 బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు.

ముఖ్యంగా క్లరికల్ మరియు ఆఫీసర్ కేడర్లలో ఈ నియామకాలు ఉండనున్నట్లు సీఎస్ శెట్టి స్పష్టం చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, బ్యాంకింగ్ సేవల అవసరాలకు అనుగుణంగా ఈ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్‌బీఐ అత్యంత భారీ నెట్‌వర్క్‌ను కలిగి ఉనప్పటికీ, ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకే 200 నుంచి 250 కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

మార్చి 2026 నాటికి ఎస్‌బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలు దాటినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ మొత్తం 25,633 మందిని రిక్రూట్ చేసుకోగా, ఈ ఏడాదీ భారీ స్థాయిలో నియామకాలు చేపడుతుండటం గమనార్హం. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రతిపాదిస్తున్న రూ.30,000 కోట్ల ఐపీఓలో ఎస్‌బీఐ మరియు దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సంయుక్తంగా 1 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story