UoH: డిజిటల్ విద్యలో మరో అడుగు.. రెండు ఆన్‌లైన్ కోర్సులు, సరికొత్త స్టూడియోను ప్రారంభించిన హెచ్‌సీయూ!
UoH Digital Learning Studio: హైదరాబాద్ విశ్వవిద్యాలయం రెండు కొత్త ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులతో పాటు సరికొత్త వీడియో రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించింది.
UoH: డిజిటల్ విద్యలో మరో అడుగు.. రెండు ఆన్‌లైన్ కోర్సులు, సరికొత్త స్టూడియోను ప్రారంభించిన హెచ్‌సీయూ!
UoH Digital Learning Studio: ప్రముఖ కేంద్రీయ విద్యా సంస్థ ‘హైదరాబాద్ విశ్వవిద్యాలయం’ (UoH - యూఓహెచ్) తన డిజిటల్ విద్యా సేవలను మరింత విస్తరించింది. క్యాంపస్‌లోని సెంటర్ ఫర్ డిజిటల్ లెర్నింగ్, ట్రైనింగ్ అండ్ రిసోర్సెస్ (CDLTR) విభాగంలో రెండు కొత్త ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన సరికొత్త వీడియో రికార్డింగ్ స్టూడియోను విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చింది.
కొత్త ఆన్‌లైన్ కోర్సులు ఇవే:
క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జె. అనురాధ ఈ కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు.
సంసాధని ప్రవేశిక: కంప్యూటేషనల్ టూల్స్ సహాయంతో సంస్కృతాన్ని సులభంగా నేర్చుకునేలా ఈ కోర్సును రూపొందించారు.
అధునాతన మలేరియాలజీ: పరాన్నజీవిత్వం (Parasitism) మరియు మలేరియా ఔషధ నిరోధకత యొక్క జీవశాస్త్రంపై పరిశోధనాత్మక అవగాహన కోసం దీనిని ప్రవేశపెట్టారు.
అందరికీ నాణ్యమైన ఉన్నత విద్య
ఈ సందర్భంగా CDLTR డైరెక్టర్ ప్రొఫెసర్ సల్మాన్ అబ్దుల్ మోయిజ్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా విశ్వవిద్యాలయం యొక్క విద్యా నైపుణ్యాన్ని క్యాంపస్ వెలుపల ఉండే సామాన్య అభ్యాసకులకు కూడా చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్థాయిలలో మరిన్ని విభాగాల నుంచి డిజిటల్ కోర్సులను తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరో అతిథి ప్రొఫెసర్ వాసుకి బెలవాడి మాట్లాడుతూ.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే 40 డైరెక్ట్-టు-హోమ్ (DTH) విద్యా ఛానెళ్ల సముదాయం ‘స్వయంప్రభ’ ప్రాముఖ్యతను వివరించారు. ఈ ప్లాట్‌ఫామ్ కోసం నాణ్యమైన కోర్సులను డిజైన్ చేయాలని ఆయన అధ్యాపకులను కోరారు. ఇవి యూట్యూబ్‌లో కూడా ఉచితంగా లభిస్తాయని పేర్కొన్నారు.
బలోపేతం కానున్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్:
కొత్తగా ప్రారంభించిన వీడియో రికార్డింగ్ స్టూడియో ద్వారా అధ్యాపకులు మరింత నాణ్యమైన ఈ-కంటెంట్‌ను రూపొందించడానికి వీలవుతుందని వీసీ ప్రొఫెసర్ అనురాధ తెలిపారు. ఆన్‌లైన్ విద్యా బోధనలో అధ్యాపకులకు అవసరమైన సాంకేతిక శిక్షణను అందించేందుకు త్వరలోనే ప్రత్యేక ‘ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్’ నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు.




