సివిల్స్ సాధనలో 'త్రిముఖ వ్యూహం'.. ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఒకే ప్రిపరేషన్: విజేత తరుణ్ తేజ పిలుపు!
UPSC Success Story: సివిల్స్ విజేత తరుణ్ తేజ (AIR 123) సక్సెస్ మంత్రం! తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 'సంకల్ప సాధన దీక్ష'. ప్రిలిమ్స్, మెయిన్స్ సమగ్ర వ్యూహం మరియు త్రిముఖ వ్యూహం గురించి పూర్తి వివరాలు ఇక్కడ..
సివిల్స్ సాధనలో 'త్రిముఖ వ్యూహం'.. ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు ఒకే ప్రిపరేషన్: విజేత తరుణ్ తేజ పిలుపు!
UPSC Success Story: సివిల్ సర్వీసెస్ అనేది కేవలం పరీక్ష మాత్రమే కాదని, అది మన శక్తి సామర్థ్యాలకు అసలైన పరీక్ష అని యూపీఎస్సీ విజేత (AIR 123) తరుణ్ తేజ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న 40 రోజుల "సంకల్ప సాధన దీక్ష"లో భాగంగా మంగళవారం ఆయన అభ్యర్థులకు ప్రత్యేక మార్గదర్శనం చేశారు.
సమగ్ర ప్రిపరేషన్ ముఖ్యం:
ఈ సందర్భంగా తరుణ్ తేజ మాట్లాడుతూ, అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను విడివిడిగా చూడకుండా, మూడింటినీ కలిపి సమీకృత (Integrated) విధానంలో చదవాలని సూచించారు. జనరల్ స్టడీస్‌ను మెయిన్స్ దృక్కోణంలో చదువుతూనే, ప్రిలిమ్స్ కోసం పాయింట్ వైజ్ నోట్స్ సిద్ధం చేసుకోవాలి. సీ-శాట్ (C-SAT) విషయంలో ఇంగ్లీష్ కాంప్రెహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయడం ద్వారా లోపాలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు.
వరంగల్ నుంచి ఐఏఎస్ వరకు:
వరంగల్‌కు చెందిన తరుణ్ తేజ ఐఐటీ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొలి నుంచి సివిల్స్ లక్ష్యంగా శ్రమించి, తాజా ఫలితాల్లో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కేడర్ దక్కించుకోబోతున్నారు. తెలంగాణ యువతకు ఆయన ఇప్పుడు ఒక స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
బీసీ స్టడీ సర్కిల్ 'త్రిముఖ వ్యూహం':
స్టేట్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, అభ్యర్థుల విజయం కోసం తాము ఒక త్రిముఖ వ్యూహాన్ని రూపొందించామని వివరించారు.
మొదటి దశ: తొమ్మిది నెలల పాటు నిపుణులచే విస్తృత అధ్యయనం, శిక్షణ.
రెండవ దశ: 40 రోజుల 'సంకల్ప సాధన దీక్ష'లో ప్రతిరోజు మోడల్ టెస్టులు, మూల్యాంకనం.
మూడవ దశ: మే 24, 2026 న జరిగే ప్రిలిమ్స్ పరీక్షా సమయంలో ఏకాగ్రత, నైపుణ్యాల ప్రదర్శన.
అభ్యర్థులకు అండగా ప్రభుత్వం:
అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టడీ సర్కిల్ అందుబాటులో ఉంటుందని హరికృష్ణ తెలిపారు. అభ్యర్థుల విన్నపం మేరకు ఈ కార్యక్రమాన్ని మే 23 వరకు పొడిగిస్తూ, వారికి అవసరమైన ఆర్థిక సౌకర్యాలను కూడా అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అనంతరం తరుణ్ తేజను శాలువాతో ఘనంగా సత్కరించారు.




