కెరీర్ గైడెన్స్కు ముందు విద్యార్థులకు ‘వైఫల్య అక్షరాస్యత’ ఎందుకు అవసరం? విద్యావేత్తల కీలక విశ్లేషణ!
Failure literacy: కెరీర్ కౌన్సెలింగ్కు ముందే విద్యార్థులకు వైఫల్యాలను తట్టుకునే నైపుణ్యాన్ని నేర్పించడం ఎందుకు కీలకమో ఇక్కడ తెలుసుకోండి.
కెరీర్ గైడెన్స్కు ముందు విద్యార్థులకు ‘వైఫల్య అక్షరాస్యత’ ఎందుకు అవసరం? విద్యావేత్తల కీలక విశ్లేషణ!
Failure literacy: "సవాళ్లే జీవితాన్ని ఆసక్తికరంగా చేస్తాయి, వాటిని అధిగమించడమే జీవితాన్ని అర్థవంతంగా చేస్తుంది" అంటారు ప్రముఖ రచయిత జోషువా జె. మెరైన్. నేటి అత్యంత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిరంతరం పరీక్షల ఒత్తిడిని, మార్కుల వేటను ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల అంచనాలు వారి విద్యా ప్రయాణాన్ని ఒక భారంగా మారుస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో చిన్న ఎదురుదెబ్బ తగిలినా విద్యార్థులు కుంగిపోతున్నారు. అందుకే, కెరీర్ పరంగా వారికి మార్గదర్శకత్వం (Career Guidance) అందించడానికి ముందే.. ‘వైఫల్య అక్షరాస్యత’ (Failure Literacy) నేర్పించడం అత్యంత అవసరమని విద్యా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అసలు ‘వైఫల్య అక్షరాస్యత’ అంటే ఏమిటి?
వైఫల్యం అనేది శాశ్వతం కాదని, అదొక అభ్యసన ప్రక్రియలో భాగమని గ్రహించడమే ‘వైఫల్య అక్షరాస్యత’. తోటి విద్యార్థుల కంటే వెనుకబడినప్పుడు లేదా ఆశించిన ఫలితాలు రానప్పుడు, దానిని అసమర్థతగా భావించకుండా.. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునేలా ఇది విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. ఇది వారిలో నిరాశను తొలగించి, లక్ష్యం వైపు మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేలా చేస్తుంది.
అభివృద్ధి దృక్పథం (Growth Mindset) ముఖ్యం:
వైఫల్య అక్షరాస్యతకు ప్రధాన పునాది అభివృద్ధి దృక్పథం. దీనిని అలవర్చుకున్న విద్యార్థులు నిరంతర సాధన, పట్టుదల ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని నమ్ముతారు. దీనికి విరుద్ధంగా ‘స్థిర దృక్పథం’ (Fixed Mindset) ఉన్నవారు తాత్కాలిక వైఫల్యాన్ని తమ శాశ్వత బలహీనతగా భావించి చేతులెత్తేస్తారు. అందుకే ప్రతి సవాలు కొత్త పాఠాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలను పెంచుకోవడానికి వచ్చిన అవకాశంగా గుర్తించేలా విద్యార్థులను సిద్ధం చేయాలి.
పాఠశాలలు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం:
తరగతి గదుల్లో తప్పులు చేయడం, అడ్డంకులను ఎదుర్కోవడం వంటి అంశాలపై బహిరంగ చర్చలు జరగాలి. ఉపాధ్యాయులు తమ కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్లను, అపజయాలను విద్యార్థులతో పంచుకోవడం ద్వారా.. వైఫల్యం అనేది దాచాల్సిన విషయం కాదనే నమ్మకం విద్యార్థులలో కలుగుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో స్వీయ-విశ్లేషణ చేసుకునే సురక్షితమైన వాతావరణాన్ని పాఠశాలలు కల్పించాలి.
భావోద్వేగాల నియంత్రణే అసలైన విజయం:
పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం లేదా అనుకున్న సీటు దక్కకపోవడం వంటివి తీవ్ర ఆందోళనకు, ఆత్మసందేహానికి దారితీస్తాయి. ఈ సమయంలో జర్నలింగ్, మైండ్ఫుల్నెస్, ధ్యానం వంటి పద్ధతులను పాటించడం వల్ల విద్యార్థులు తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలరు. ఇటువంటి మానసిక శ్రేయస్సు కార్యక్రమాలను పాఠశాలలు తమ సిలబస్లో భాగం చేయాలి.
అడ్డంకులు లేని విజయం ఎక్కడా ఉండదు. సవాళ్లను ఆటంకాలుగా కాకుండా అవకాశాలుగా మార్చుకునే మనస్తత్వాన్ని చిన్నతనం నుంచే అలరింపజేస్తే.. విద్యార్థులు విద్యాపరంగానే కాకుండా, రేపటి సమాజంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకుని నిలబడతారని ‘సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్’ ట్రస్టీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.




