ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం 2026: AI యుగంలో భావప్రసార నైపుణ్యమే అతిపెద్ద పోటీ ప్రయోజనం
World Youth Skills Day 2026: AI యుగంలో కెరీర్ విజయానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు కీలకమో ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం వేళ ఈ కథనంలో తెలుసుకోండి.
ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం 2026: AI యుగంలో భావప్రసార నైపుణ్యమే అతిపెద్ద పోటీ ప్రయోజనం
World Youth Skills Day 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో యువతకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు అంతకు మించిన ఒక అస్త్రం అత్యవసరంగా మారింది. అదే ‘భావప్రసార నైపుణ్యం’ (Communication Skills). నేడు ‘ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం’ సందర్భంగా, కేవలం డిగ్రీలు, మార్కులే కాకుండా, ఆలోచనలను సరైన రీతిలో వ్యక్తపరచడమే ఒక అభ్యర్థి కెరీర్ వృద్ధిని ఎలా డిసైడ్ చేస్తుందో తెలిపే ప్రత్యేక కథనం.
తెలుసుకోవడం వేరు.. తెలియజేయడం వేరు!
మన విద్యా వ్యవస్థలో చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఒకటే. ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి కానీ, వాటిని ఇంటర్వ్యూలలో లేదా నలుగురి ముందు వివరించాల్సి వచ్చినప్పుడు మాటలు రావు. పాఠశాలలు, కళాశాలలు సబ్జెక్టు నాలెడ్జ్‌ను పరీక్షించినంతగా, ఆ నాలెడ్జ్‌ను ఇతరులకు ఎంత ప్రభావవంతంగా వివరిస్తున్నారనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ గ్యాప్ ఉన్నత చదువులు పూర్తి చేసి కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టేటప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్ డిగ్రీలు మిమ్మల్ని ఇంటర్వ్యూ గది వరకు తీసుకెళ్తే, అక్కడ ఉద్యోగం సాధించి పెట్టేది మాత్రం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.
కార్పొరేట్ ఉద్యోగాల్లో కమ్యూనికేషన్ పాత్ర:
ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా డేటా విశ్లేషణ, ఎక్సెల్ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఎంత అవసరమో.. వేర్వేరు బృందాలతో సమన్వయం చేసుకోవడం, మేనేజ్‌మెంట్‌కు నివేదికలను స్పష్టంగా వివరించడం అంతే ముఖ్యం. ముఖ్యంగా లీడర్‌షిప్ స్థాయికి ఎదగాలంటే కమ్యూనికేషన్ అనేది ప్రాథమిక సూత్రం.
AI యుగంలో కమ్యూనికేషన్ ఎందుకు వ్యూహాత్మక నైపుణ్యం?
నేడు ఏఐ సాధనాలు ఈమెయిల్స్ రాయగలవు, కోడింగ్ చేయగలవు, ప్రెజెంటేషన్లు సిద్ధం చేయగలవు. కానీ, ఏఐ మెరుగ్గా పనిచేయాలన్నా దానికి సరైన ఆదేశాలు (Prompts) ఇవ్వాల్సింది మనిషే. ఒకే రకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఇద్దరు వ్యక్తులలో.. సందర్భాన్ని బట్టి స్పష్టమైన కమాండ్స్ ఇవ్వగల వ్యక్తి మాత్రమే ఏఐ నుంచి అద్భుతమైన ఫలితాలను రాబట్టగలడు. అందుకే ఏఐ-ఆధారిత ప్రపంచంలో భావప్రసారం అనేది కేవలం ఒక సాఫ్ట్ స్కిల్ కాదు, అదొక వ్యూహాత్మక ఆయుధం.
నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
♦ కమ్యూనికేషన్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, సాధనతో సాధ్యమయ్యేది.
♦ నిత్యం ఏదో ఒక అంశంపై రాయడం అలవాటు చేసుకోవాలి.
♦ క్లిష్టమైన విషయాలను స్నేహితులకు సరళంగా వివరించే ప్రయత్నం చేయాలి.
♦ ఒక నిమిషం పాటు సెల్ఫ్ వీడియోలు రికార్డ్ చేసుకుని లోపాలను సరిదిద్దుకోవాలి.
♦ కాలేజీ, ఆఫీస్ ఈవెంట్లలో ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
ఈ ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువత సాంకేతికతను నేర్చుకుంటూనే, తమ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పదును పెట్టుకోవాలి. ఎందుకంటే, మీ వద్ద ఉన్న మిగతా నైపుణ్యాలన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేసేది మీ కమ్యూనికేషన్ మాత్రమేనని లెవరేజ్డ్ గ్రోత్ సీఈఓ ఈ సందర్భంగా విశ్లేషించారు.




