Indian Army: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం.. ఉచితంగా ఇంజనీరింగ్ చదివే అవకాశం

Indian Army: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మంచి కెరీర్ కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇండియన్ ఆర్మీ భారీ అవకాశం తీసుకొచ్చింది.

Mokshith
Updated on: 17 May 2026 2:34 PM IST
Indian Army
X

Indian Army: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం.. ఉచితంగా ఇంజనీరింగ్ చదివే అవకాశం

Indian Army: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత మంచి కెరీర్ కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇండియన్ ఆర్మీ భారీ అవకాశం తీసుకొచ్చింది. దేశ సేవ చేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-56 (TES-56) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులకు ఉచితంగా బీటెక్ విద్యతో పాటు మిలిటరీ ట్రైనింగ్ కూడా అందించనున్నారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఈ నియామక ప్రక్రియకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో చదివి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అదనంగా JEE Main 2026 పరీక్ష రాసి ఉండటం తప్పనిసరి. JEE స్కోర్ ఆధారంగానే మొదటి దశలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వయస్సు విషయానికి వస్తే 2027 జనవరి 1 నాటికి కనీసం 16 సంవత్సరాలు 6 నెలలు పూర్తి అయి ఉండాలి. గరిష్టంగా 19 సంవత్సరాలు 6 నెలల మధ్య వయస్సు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ స్కీమ్‌లో ఎంపిక పూర్తిగా ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. మొదట JEE Main స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తర్వాత ఎంపికైన వారికి SSB ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. అభ్యర్థుల మానసిక స్థైర్యం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ వంటి అంశాలను పరీక్షిస్తారు. SSBలో ఉత్తీర్ణులైన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశలు పూర్తి చేసిన తర్వాత తుది మెరిట్ జాబితా విడుదల అవుతుంది. ఇందులో స్థానం సంపాదించిన వారికి ఆర్మీలో శిక్షణ అవకాశం లభిస్తుంది.

శిక్షణతో పాటు ఫ్రీ ఇంజినీరింగ్

TES-56 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మొత్తం నాలుగేళ్ల శిక్షణ ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాలు దేశంలోని పుణే, సికింద్రాబాద్ వంటి ఆర్మీ ట్రైనింగ్ కేంద్రాల్లో మిలిటరీ ట్రైనింగ్‌తో పాటు ఇంజినీరింగ్ విద్య అందిస్తారు. చివరి సంవత్సరం డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ డిగ్రీ అందజేస్తారు. అదే సమయంలో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో నియామకం కల్పిస్తారు. దీంతో విద్య పూర్తయ్యే సరికి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కూడా లభిస్తుంది.

స్టైపెండ్, జీతం, దరఖాస్తు వివరాలు

శిక్షణ సమయంలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా సుమారు రూ.15,500 స్టైపెండ్ అందుతుంది. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు బేసిక్ పే లభించే అవకాశం ఉంటుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 13, 2026 నుంచి ప్రారంభమైంది. జూన్ 12, 2026 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (https://joinindianarmy.nic.in/Authentication.aspx) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దేశ సేవతో పాటు ఉన్నత విద్య, మంచి ఉద్యోగం కోరుకునే యువతకు ఇది అరుదైన అవకాశం అని చెప్పొచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story