IIT JEE : మరికొద్ది గంటల్లోనే ఐఐటీ జేఈఈ ఫలితాలు విడుదల.. ఈసారి కటాఫ్ భారీగా తగ్గే అవకాశం
IIT JEE : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీ రూర్కీ ర్యాంకులను ప్రకటించనుండగా, ఈసారి కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
IIT JEE
IIT JEE : దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసి, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. పరీక్షను నిర్వహించిన ఐఐటీ రూర్కీ ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు (జూన్ 1, సోమవారం) ఉదయం 10 గంటలకే అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోర్‌కార్డులు, ఆలిండియా ర్యాంకులను (AIR) అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ర్యాంకులను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఐఐటీ రూర్కీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ రోజు ఉదయం కరెక్ట్‌గా 10 గంటలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల లింక్‌ను యాక్టివేట్ చేయనుంది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను సులువుగా చూసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://jeeadv.ac.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. హోమ్‌పేజీలో కనిపించే JEE Advanced 2026 Results అనే లింక్‌పై క్లిక్ చేసి, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి. ఆ వెంటనే మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తులో జరిగే JoSAA కౌన్సెలింగ్ అవసరాల కోసం దీనిని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవడం మంచిది.
ఈ ఏడాది మే 17న దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 1.80 లక్షల మంది విద్యార్థులు ఈ అత్యున్నత ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అయితే ఈసారి క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా రావడంతో విద్యార్థులు కాస్త టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసే వారిలో 25 నుంచి 30 శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తుంటారు. ఆ లెక్కన ఈ ఏడాది దాదాపు 45 వేల నుంచి 50 వేల మంది వరకు విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత కొన్ని ఏళ్లతో పోలిస్తే ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా వచ్చినందున, ఈ ఏడాది ఐఐటీ సీట్ల భర్తీకి సంబంధించిన కటాఫ్ మార్కులు గతం కంటే భారీగా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది (2025)లో కౌన్సెలింగ్ అర్హత కోసం మొత్తం 360 మార్కులకుగానూ కటాఫ్‌ను 74 మార్కులుగా నిర్ణయించారు. కానీ ఈసారి పేపర్ టఫ్‌గా ఉన్నందున సుమారు 70 మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా అర్హత లభించే చాన్స్ ఉంది. ఒకవేళ నిపుణుల అంచనాలే నిజమైతే.. ఈసారి తక్కువ స్కోర్ వచ్చినప్పటికీ విద్యార్థులకు మెరుగైన ఆలిండియా ర్యాంకు లభించే అవకాశం ఉంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో సాధించే ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఐఐటీలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో బీ.టెక్, బీ.టెక్-ఎం.టెక్ డ్యూయల్ డిగ్రీ, బీఎస్ (సైన్స్), బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ వంటి ప్రతిష్టాత్మక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఐటీలన్నింటిలో కలిపి మొత్తం 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి పేపర్ కష్టంగా ఉన్నప్పటికీ సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసేసరికి ముగింపు ర్యాంక్ కూడా ఈ సీట్ల సంఖ్యకు దగ్గరగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
గత ఏడాది (2025) జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల సరళిని గమనిస్తే విద్యార్థులకు ఒక అంచనా వస్తుంది. పోయినసారి 92 మార్కులు సాధించిన ఒక విద్యార్థికి 20,792వ ర్యాంకు రాగా, ఐఐటీ వారణాసి (BHU)లో ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లో సీటు దక్కింది. అలాగే 97 మార్కులతో 18,156వ ర్యాంకు తెచ్చుకున్న మరో విద్యార్థి ఐఐటీ జమ్మూలో మెటీరియల్స్ ఇంజనీరింగ్ బీటెక్ సీటు సాధించాడు. ఇక అమ్మాయిల కోటా విభాగంలో 80 మార్కులతో 28,481వ ర్యాంకు సాధించిన విద్యార్థినికి ఐఐటీ వారణాసిలో ఆర్కిటెక్చర్, 83 మార్కులతో 26,767వ ర్యాంకు సాధించిన మరో అమ్మాయికి ఐఐటీ జమ్మూలో సివిల్ ఇంజనీరింగ్ సీట్లు లభించాయి. ఈ ఫలితాల అనంతరం దేశంలోని వివిధ ఐఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ (JoSAA కౌన్సెలింగ్) అధికారికంగా ప్రారంభం కానుంది.




