NEET UG 2026 : ప్రశాంతంగా ముగిసిన ‘నీట్’ రీ-ఎగ్జామ్.. టాప్ స్కోర్ ఎంత ఉండబోతోందో తెలుసా?
NEET UG 2026 : దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు కఠినంగా రావడంతో ఈసారి కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
NEET UG 2026
NEET UG 2026 : దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఏర్పాటు చేసిన 5,440 కేంద్రాలతో పాటు, విదేశాల్లోని మరో 14 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఎలాంటి అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా ఉండేందుకు అధికారులు ఏకంగా 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా 95 వేల పరీక్ష గదులను లైవ్‌లో నిశితంగా పరిశీలించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ఢిల్లీలోని ఎన్‌టీఏ ప్రధాన కార్యాలయం నుంచి పరీక్షా సరళిని సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో కేవలం 37 రోజుల్లోనే ఈ రీ-ఎగ్జామ్‌ను విజయవంతంగా నిర్వహించామని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ప్రకటించారు.
విద్యార్థులను కంగారు పెట్టిన ఫిజిక్స్, కెమిస్ట్రీ
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగిన ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ సహా మొత్తం 13 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. దివ్యాంగ విద్యార్థులకు గంట అదనపు సమయం ఇవ్వడంతో వారి పరీక్ష సాయంత్రం 6.20 వరకు కొనసాగింది. అయితే మే 3న జరిగిన మొదటి విడత పరీక్షతో పోలిస్తే ఈసారి క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల నుంచి అడిగిన ప్రశ్నలు విద్యార్థులను గందరగోళానికి గురిచేశాయి. ఫిజిక్స్‌లో ఇచ్చిన 4, 5 ప్రశ్నలు అసలు అర్థం కాని రీతిలో ఉన్నాయని, కెమిస్ట్రీలో న్యూమరికల్, మెమరీ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా రావడం వల్ల కాలిక్యులేషన్స్‌కు విపరీతమైన సమయం పట్టిందని అభ్యర్థులు వెల్లడించారు.
బయాలజీ ఒక్కటే ఊరట.. తగ్గనున్న టాప్ స్కోర్
కఠినమైన ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లతో పోలిస్తే జీవశాస్త్రం పేపర్ మాత్రం విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది. బోటనీ, జువాలజీ విభాగాల నుంచి వచ్చిన ప్రశ్నలన్నీ పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచే వచ్చాయి. ఈ పుస్తకాలను క్షుణ్ణంగా చదివిన విద్యార్థులు బయాలజీలో పూర్తి స్థాయి మార్కులు సాధించే అవకాశం ఉందని సబ్జెక్ట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీలలో స్కోరింగ్ తగ్గే అవకాశం ఉన్నందున, ఈసారి ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా వచ్చే అత్యధిక మార్కులు గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది. గతేడాది తరహాలో కాకుండా ఈసారి టాప్ స్కోర్ 700 నుంచి 710 మార్కుల మధ్యే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు.
కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనా
ప్రశ్నపత్రం కఠినంగా మారడంతో ఈసారి నీట్ యూజీ కటాఫ్ మార్కులు కూడా తగ్గే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓపెన్ కేటగిరీకి సంబంధించి గత ఏడాది కటాఫ్ మార్కులు 487 ఉండగా.. ఈసారి కూడా కటాఫ్ దాదాపు అదే స్థాయిలో లేదా అంతకంటే కొద్దిగా తగ్గేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఎన్‌టీఏ అత్యంత వేగంగా, పకడ్బందీగా రీ-ఎగ్జామ్ ముగించడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదుపరి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




