Polavaram: ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ
Polavaram: పోలవరం జిల్లాలో నవంబర్ 19న ఎంపీపీ, 20న జెడ్పీ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ వెల్లడించారు.
Polavaram: ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ జారీ
పోలవరం జిల్లా: పోలవరం జిల్లా పరిధిలోని 101 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ), 12 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) సభ్యుల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 5వ తేదీన పోలింగ్ నిర్వహించగా, ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 మండల ప్రజా పరిషత్‌లు, ఒక జిల్లా ప్రజా పరిషత్‌లో కో-ఆప్టెడ్ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం (10.11.2026) నోటిఫికేషన్లు జారీ చేసిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం ఈ నెల 19వ తేదీన మండల ప్రజా పరిషత్‌లలో కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన జిల్లా పరిషత్‌లో కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికతో పాటు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె దినేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు నిర్ణీత తేదీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారనీ తెలియ చేయడం జరిగింది.
ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. అదేవిధంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, మరొకరిని వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటారు. ప్రతి మండల పరిషత్‌లో ఒక కో-ఆప్టెడ్ సభ్యుడిని, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కో-ఆప్టెడ్ సభ్యులు మతపరమైన మైనారిటీ లేదా భాషాపరమైన మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులై ఉండాలి. ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల కంటే ముందుగా కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను నిర్వహిస్తారు.
ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు జరిగే ఎన్నికలను చేతులు పైకెత్తి ఓటు వేసే (Show of Hands) విధానంలో నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు జారీ చేసే పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికల విషయంలో పార్టీ విప్ వర్తించదనీ తెలిపారు.
సంబంధిత మండల, జిల్లా పరిషత్‌లకు ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్న పార్లమెంట్ సభ్యులు (ఎంపీలు), శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు), శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యేందుకు ఆహ్వానించబడతారనీ, అయితే వారికి ఈ పరోక్ష ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
నిర్ణీత ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న నిర్వహించనున్న ఎంపీపీ ఎన్నికలు, 20న నిర్వహించనున్న జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక సమావేశాల నోటీసులను ఈ నెల 14వ తేదీలోగా అందచేయడం జరుగుతుందనీ తెలియ చేశారు. పరోక్ష ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమగ్ర మార్గదర్శకాలు, విధివిధానాలను జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన రెండు నోటిఫికేషన్లు, వాటిలో పేర్కొన్న మార్గదర్శకాలు, ఎన్నికల విధివిధానాలను పూర్తిస్థాయిలో అనుసరిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం తొలిసారిగా జిల్లాలోని 12 మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లో పరోక్ష ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ వెల్లడించారు.




