Chintoor: ఒడిశాలో భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశం ఇంచార్జి కలెక్టర్!
Chintoor: చింతూరు కూనవరం శబరి నది వద్ద వరద పరిస్థితిని పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్ ప్రశాంత్ కుమార్. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Chintoor: ఒడిశాలో భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలకు అవకాశం ఇంచార్జి కలెక్టర్!
చింతూరు: కూనవరం శబరి నది వంతెన వద్ద శుక్రవారం రాత్రి శబరి నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పోలవరం జిల్లా ఇంచార్జి కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ పరిశీలించారు.శబరి నదిలో నీటిమట్టం, వరద పరిస్థితి, పరివాహక ప్రాంతాల్లోని పరిస్థితుల పై అధికారులను వివరాలను అడిగి తెలుసు కున్నారు.
ప్రస్తుతం కూనవరం పరిసర ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగానే ఉన్నప్పటికీ,ఒడిశా రాష్ట్రంలోని శబరి నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆకస్మికంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులకు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు.శబరి నది నీటిమట్టం,వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, నీటిమట్టంలో మార్పులు చోటుచేసుకున్న వెంటనే అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, వాగులు,కాలువలు, రహదారుల పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.వరద పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని,అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
తహశీల్దార్లు, పోలీసు,పంచాయతీరాజ్, వైద్య,విద్యుత్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఇంచార్జ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు.క్షేత్రస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని,అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన సహాయక సామగ్రి, రవాణా వాహనాలు,పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రజలు అధికార యంత్రాంగం నుంచి వచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.వరద పరిస్థితి పై ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మవద్దని సూచించారు.




