Chintoor: దశాబ్దాల నిరీక్షణకు తెర... చింతూరు సర్పంచ్‌గా కారం సత్యవతి ఘన విజయం

Chintoor: చింతూరు సర్పంచ్‌గా కారం సత్యవతి 483 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఘన విజయం. గ్రామంలో సంబరాలు.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 29 Nov 2026 9:49 PM IST
Chintoor
X

Chintoor: దశాబ్దాల నిరీక్షణకు తెర... చింతూరు సర్పంచ్‌గా కారం సత్యవతి ఘన విజయం

చింతూరు: ఈరోజు ఉదయం చింతూరులో వాతావరణం వేరేలా ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సర్పంచ్ ఎన్నిక పోలింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఓటు వేయడానికి బారులు తీరిన జనం, ప్రతి ఓటు వెనుక ఒక ఆశ, ఒక నమ్మకం.ఒంటిగంటకు పోలింగ్ ముగియగానే... ఇక అసలు కథ మొదలైంది. రెండు గంటల నుంచి అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టారు. బయట నిలబడిన జనం ఊపిరి బిగబట్టి ఎదురుచూశారు.

ఒక్కో రౌండ్ ఫలితం వస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోయింది.మొదట్లో హోరాహోరీ... ఆ తర్వాత క్రమంగా సత్యవతి హవా! ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం పెరుగుతూనే ఉంది. ప్రత్యర్థి శిబిరంలో నిశ్శబ్దం... సత్యవతి శిబిరంలో ఉత్సాహం.చివరకు అధికారుల ప్రకటన... చింతూరు దద్దరిల్లిపోయింది! కారం సత్యవతి 483 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. దశాబ్దాల కాలంగా రాని చింతూరు పంచాయతీ పీఠాన్ని దక్కించుకుని చరిత్రను తిరగరాశారు.

ఫలితం వినగానే వీధుల్లో పండగ మొదలైంది. డప్పుల మోత, పూల వర్షం, బాణాసంచా వెలుగుల మధ్య నాయకులు, కార్యకర్తలు సత్యవతిని భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.భావోద్వేగంతో మాట్లాడిన సత్యవతి... “నన్ను గెలిపించిన ప్రజలకు పాదాభివందనాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. చింతూరు పంచాయతీని అభివృద్ధి బాటలో పయనింపజేస్తాను” అని శపథం చేశారు.

ఈ చారిత్రక విజయం వెనుక తెలుగుదేశం మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ కృషి ఎంతగానో ఉందని పలువురు కొనియాడారు. ఉదయం నుంచి చివరి వరకు గ్రామంలోనే ఉండి ప్రతి ఓటరును కలుపుకున్న ఆయన వ్యూహమే ఈ ఘన విజయానికి పునాది అయ్యింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR