Kukkunur: కుక్కునూరులో సైడ్ డ్రెయిన్ల ఆక్రమణ ప్రజలకు తప్పని తిప్పలు!

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు సెంటర్‌లో డ్రెయినేజీ ఆక్రమణలతో ప్రజల ఇబ్బందులు ఆర్‌అండ్‌బీ సర్వే, బస్ షెల్టర్ ఏర్పాటుకు డిమాండ్.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 4 Sept 2026 6:57 PM IST
Kukkunur
X

Kukkunur: కుక్కునూరులో సైడ్ డ్రెయిన్ల ఆక్రమణ ప్రజలకు తప్పని తిప్పలు!

Kukkunur: కుక్కునూరు మండల కేంద్రంలో రహదారికి ఇరువైపులా నిర్మించిన సైడ్ డ్రెయిన్లు ఆక్రమణలకు గురికావడంతో వర్షపు నీరు వెళ్లేందుకు మార్గం లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో బూర్గంపాడు నుంచి అశ్వారావుపేట వరకు రహదారుల విస్తరణలో భాగంగా రహదారుల భవనాల శాఖ ఆధ్వర్యంలో కుక్కునూరు మండల కేంద్రంలో రహదారికి ఇరువైపులా సైడ్ డ్రెయిన్లను ఏర్పాటు చేశారు. వర్షపు నీరు రహదారిపై నిలవకుండా ఈ డ్రెయిన్లను నిర్మించారు. అయితే కాలక్రమేణా రహదారి మార్జిన్లు, డ్రెయిన్ల ప్రాంతాలు ఆక్రమణలకు గురవడంతో డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

దీంతో వర్షం కురిసిన సమయంలో నీరు రహదారిపైనే నిలిచిపోతుండటంతో బాటసారులు, ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కుక్కునూరు మెయిన్ సెంటర్‌లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు అంటున్నారు.

బస్ షెల్టర్ లేక.. షాపుల ముందు నిలబడాల్సిందే!..

కుక్కునూరు మెయిన్ సెంటర్ నుంచి ప్రతిరోజూ వందలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ప్రయాణికులు వేచి ఉండేందుకు సరైన బస్ షెల్టర్ లేకపోవడంతో రహదారి పక్కన, షాపుల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటున్నారు.

ప్రభుత్వ రహదారి పరిధిలో ప్రయాణికులు సురక్షితంగా నిలబడే స్థలం ఉండాల్సి ఉండగా, డ్రెయిన్లపై ఏర్పడిన ఆక్రమణలు, రహదారి మార్జిన్ల వినియోగంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని వారు అంటున్నారు.

ఆర్‌అండ్‌బీ హద్దులు స్పష్టం చేయాలి..

కుక్కునూరు గ్రామ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు కుకునూరు మెయిన్ సెంటర్‌లో రహదారి పరిధి, మార్జిన్లు, సైడ్ డ్రెయిన్ల హద్దులను సర్వే చేసి స్పష్టంగా గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆక్రమణలకు గురైన సైడ్ డ్రెయిన్లను గుర్తించి పునరుద్ధరించడంతో పాటు, వర్షపు నీరు సజావుగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెయిన్ సెంటర్‌లో తగిన బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story